జగన్ ధీమాతో ఉన్నారా...తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ మాదిరి !?
వైసీపీ అధినేత జగన్ అయితే భారీ ఓటమి నుంచి రెండు రోజుల వ్యవధిలోనే తేరుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ అయితే భారీ ఓటమి నుంచి రెండు రోజుల వ్యవధిలోనే తేరుకున్నారు. 151 సీట్లు ఎక్కడ 11 సీట్లు ఎక్కడ. అయినా ఆయన ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి తమ రెస్పాన్స్ చెప్పారు. అలాగే రెండు రోజుల తరువాత నుంచి పార్టీ నేతలకు ధైర్యం చెబుతూ సమీక్షలు నిర్వహించారు. మరి జగన్ లో ఇంతటి ధీమాకు కారణాలు ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది.
ఉమ్మడి ఏపీలో నుంచి చూసుకుంటే ఎపుడూ వన్ సైడ్ ఎలక్షన్ అన్నది లేదు. విపక్షానికి ప్రతిపక్ష హోదాని జనాలు తమ తీర్పు ద్వారా ఇచ్చేవారు. ఇక విభజన ఏపీలో చూస్తే 2014లోనూ అదే జరిగింది. కానీ 2019లో వైసీపీకి 50 శాతం ఓట్ల షేర్ తో 151 సీట్లను కట్టబెట్టారు. అపుడు 40 శాతం ఓటు షేర్ తో టీడీపీ 23 సీట్లను గెలుచుకుంది. అలా విపక్ష హోదాను టీడీపీకి జనాలు ఇచ్చారు అన్న మాట.
అదే 2024 నాటికి వచ్చేసరికి మాత్రం టీడీపీ కూటమికి ఎవరూ ఊహించని విధంగా 164 సీట్లను అందించారు. ఇక జగన్ నాయకత్వంలో వైసీపీకి 11 సీట్లే ఇచ్చారు. అంటే విపక్ష హోదా కూడా గల్లంతు అయింది అన్న మాట. ఇంతలా దారుణంగా ఓటమి పాలు అయినా వైసీపీకి 40 శాతం ఓటు షేర్ అయితే దక్కింది.
ఇక ఏపీలో చూస్తే రెండే పార్టీల వ్యవస్థ సాగుతోంది. కాంగ్రెస్ ఇపుడిపుడే పుంజుకునేది లేదు అని అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పించి ఏపీలో ఆ పార్టీ బలం కూడదీసుకునేది లేదనే అంటున్నారు. ఈ నేపరకమైన విశ్లేషణలను చూసినపుడు వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికి జగన్ కి మధ్యనే భారీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ ధీమా ఏంటి అంటే టీడీపీ కూటమి సూపర్ సిక్స్ చేయలేదు, అదే సమయంలో డెవలప్మెంట్ చేయాలీ అంటే డబ్బులు పెద్ద ఎత్తున కావాలి, ఏదో పేరుకు సంపద సృష్టిస్తామని చంద్రబాబు అన్నా అదంతా ఈజీ కాదు, అప్పులు తెస్తే ట్రోల్స్ అవుతాయి. పైగా ఆ తిప్పలు కూడా వేరేగా ఉంటాయి. దాంతోనే టీడీపీ కూటమి ఫెయిల్ అయి 2029 నాటికి తమ చేతికి అధికారం దక్కుతుంది అని జగన్ అంచనా వేసుకుంటున్నారు అని టాక్.
దానికి ఉదాహరణగా తమిళనాడు ఎన్నికలను కూడా ఆయన తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం తమిళనాడులో అంటే 1991 నుంచి 1996 మధ్యలో చూస్తే విపక్ష కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే దారుణమైన ఓటమిని చవి చూసింది. జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే స్వీప్ చేసి పారేసింది. విపక్ష హోదా కూడా దక్కలేదు. అదే 1996కి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయింది. డీఎంకే స్వీప్ చేసింది.
ఆ లెక్కలే ఇపుడు జగన్ ని ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ దారుణమైన ఓటమి అధ్బుతమైన విజయాల లెక్కలు ఎలా ఉన్నాయో చూడాల్సిందే. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఏకంగా 59.8 శాతం ఓటు షేర్ తో 225 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇది మొత్తం 234 ఉన్న అసెంబ్లీలో కేవలం తొమ్మిది సీట్లు తక్కువగా సాధించిన విజయం.
ఆ ఎన్నికల్లో డీఎంకేకు కేవలం రెండంటే రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఇక ఏఐడీఎంకేకు 160 సీట్లు వస్తే కూటమితో చేరిన కాంగ్రెస్ కి అరవై సీట్లు, ఐసీఎస్ కి ఒక సీటు దక్కాయి. డీఎంకే కూటమికి ఏడు సీట్లు వస్తే అందులో డీఎంకేకు రెండు, టీఎంకేకి రెండు, సీపీఎంకి ఒకటి, సీపీఐకి ఒకటి, జేడీకి ఒకటి దక్కాయి. ఇక ఇతరులలో చూస్తే పీఎంకేకు ఒకటి ఇండిపెండెంట్ కి ఒకటి దక్కాయి.
ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమికి 59.8 శాతం ఓటు షేర్ దక్కితే డీఎంకే కూటమికి 30 శాతం ఓటు షేర్ మాత్రమే దక్కింది. మరి రెట్టింపు ఓటు షేర్ తేడా ఉన్నా 1996లో చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది అదెలా అంటే 1996లో చూస్తే కనుక డీఎంకే కూటమి మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గానూ 221 సీట్లను గెలుచుకుని స్వీప్ చేసి పారేసింది.
ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి 53.77 శాతం ఓటు షేర్ దక్కింది. డీఎంకేకు 173 సీట్లు కూటమిలోని టీఎంసీకి 39,సీపీఐకి 7, ఏఐఎఫ్ బీకి 1 సీటు దక్కాయి. ఇక ఏఐఏడీఎంకే కూటమికి 27.08 ఓటు షేర్ తో కేవలం నాలుగే సీట్లు దక్కాయి. ఇందులో ఏఐఏడీఎంకేకి నాలుగు సీట్లు వస్తే కాంగ్రెస్ కి జీరో సీట్లు వచ్చాయి.
అలాగే ఎండీఎంకే కూటమికి రెండు సీట్లు 7.89 శాతంతో దక్కగా, పీఎంకే అలియన్స్ కి 4.61 ఓటు షేర్ తో 4 సీట్లు, ఇతరులకు మూడు సీట్లు దక్కాయి. తమిళనాడు చరిత్రలో ఇంత దారుణమైన పరాభవం అన్నది రెండు సార్లు రెండు కీలకమైన ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్నాయి. అంతే కాదు మరో రెండు సార్లు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇపుడు ఆ లెక్కలతోనే జగన్ ధీమాగా ఉన్నారు అని అంటున్నారు. ఏపీ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా రెండు ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరగడంతో 2029 రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ అయితే ఇప్పటి నుంచే ఉంది మరి.