వైఎస్సార్ సెంటిమెంట్ ని జగన్ కంటిన్యూ చేస్తారా...?
ఇక వైసీపీ రెండవసారి అంటే 2024లో అలవోకగా గెలుస్తుంది అని ఆ పార్టీ మంత్రులు మాజీ మంత్రులు అంతా చెబుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి రోజా అయితే 2024లో గెలిచేది వైసీపీయే అంటున్నారు.
వైఎస్సార్ అంటే దేనికీ వెరవని ప్రత్యేకమైన రాజకీయ వ్యక్తిత్వం అలాగని ఆయనను దేనికీ లెక్కచేయని తనంగా చూడకూడదు. ఆయనకు అన్నీ తెలుసు. ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసు. అదే ఆయనను రాజకీయంగా పది కాలల పాటు నిలబెట్టింది. సీఎం గా రెండు సార్లు చేసింది. ప్రజల హృదయాలలో కొలువుండేలా చేసింది. ఇదిలా ఉంటే వైఎస్సార్ సెంటిమెంట్ ఏంటి జగన్ కంటిన్యూ చేయడం ఏంటి అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం.
వైఎస్సార్ 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయిదేళ్ల పాటు పాలించిన తరువాత 2009లో ఆయన రెండవమారు ప్రజల తీర్పుని కోరారు. జనాలు ఆయన్ని ఆశీర్వదించి మరోమారు సీఎం గా పట్టం కట్టారు. అయితే ఆ ఎన్నికల్లో మహా కూటమిని టీడీపీ ఏర్పాటు చేసింది. అందులో టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కూడా భాగంగా ఉన్నారు. ఇలా అందరూ కలసి పోరాడినా కూడా వైఎస్సార్ గెలిచారు. మళ్లీ సీఎం అయ్యారు.
అలా వైఎస్సార్ కి రెండవమారు పట్టం కట్టిన తీరులో జగన్ కి కూడా ప్రజలు ద్వితీయ విఘ్నం లేకుండా చాన్స్ ఇస్తారా అన్నది వైఎస్సార్ అభిమానులతో పాటు వైసీపీలోనూ జరుగుతున్న చర్చ. ఇక వైసీపీ రెండవసారి అంటే 2024లో అలవోకగా గెలుస్తుంది అని ఆ పార్టీ మంత్రులు మాజీ మంత్రులు అంతా చెబుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి రోజా అయితే 2024లో గెలిచేది వైసీపీయే అంటున్నారు.
జగన్ పక్కాగా రెండవసారి సీఎం అవుతారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే రెండు సార్లు కాదు ఇంకా ఎక్కువే అని అంటున్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం 1999 నుంచి అనేక సార్లు గెలుస్తూ వస్తోందని ఆయన చెబుతున్నారు. అలాగే గుజరాత్ లో బీజేపీ గెలుస్తున్న తీరుని కూడా గుర్తు చేస్తూ జగన్ ది అలాంటి ప్రభుత్వం ని అంటున్నారు.
అయితే టీడీపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఓడింది కాబట్టి ఏపీలో వైసీపీ కూడా ఓడిపోతుంది అంటున్నారు. అయితే తెలంగాణాలో జరిగిందే జరగాలి అనుకుంటే 2018లో బీఆర్ఎస్ అక్కడ గెలిచింది మరి చంద్రబాబు ఏపీలో ఎందుకు గెలవలేదు అని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాము అన్ని హామీలు నెరవేర్చామని ప్రజలకు అన్నీ సమకూర్చామని మంచి ప్రభుత్వం అంటే వైసీపీయే కాబట్టి జగన్ గెలిచి తీరుతారు అని అంటున్నారు.
వైఎస్సార్ ఫ్యామిలీకి ఓటమి లేదని మరికొందరు వీరాభిమానులు అంటున్నారు. వైఎస్సార్ రెండవసారి కూడా గెలిచారు అని గుర్తు చేస్తూ జగన్ కూడా అలాగే సెకండర్ టెర్మ్ మంచి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అని అంటున్నారు. అయితే సెంటిమెంట్లు రాజకీయాల్లో ఎంతవరకు పనిచేస్తాయన్నది ఆలోచించాల్సిందే అన్న వారూ ఉన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పులు ఏ లాజిక్ కి అందనివి అని కూడా అంటున్నారు.
ఏపీలో విపక్షం బలంగా ఉందని కూటమి కడితే గట్టిగానే నిలబడి పోరాడుతుదని గుర్తు చేసేవారూ ఉన్నారు. అయితే జగన్ ఫైటర్ అని పైగా ఆయన వ్యూహాలు ఎవరికీ అందకుండా ఉంటాయని గెలుపు తీరలకు సునాయాసంగా పార్టీని చేరుస్తారు అని నమ్ముతున్న వారూ ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు దెబ్బ తిన్న పులి లాంటి వారు అని ఆయన అపర చాణక్యాన్ని కూడా తక్కువ చేయాల్సింది లేదని అంటున్నారు.
మొత్తానికి చూస్తే బాబు జగన్ లలో ఎవరు విజేత అవుతారు 2024లో వచ్చేది ఏ ప్రభుత్వం అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. వరసగా రెండవసారి గెలిచిన చరిత్ర ఏపీ రాజకీయాల్లో చూస్తే ఎన్టీఆర్ వైఎస్సార్ లకు మాత్రమే ఉంది. చంద్రబాబు దానిని కంటిన్యూ చేయలేకపోయారు. మరి జగన్ తన తండ్రి వైఎస్సార్ అలాగే ఎన్టీఆర్ ల మాదిరిగా సెకండ్ టెర్మ్ అధికారం నిలబెట్టుకుంటారా అంటే వెయిట్ అండ్ సీ.