అర్ధం కాలేదు జగన్ సార్ !
కానీ అందులో అంతిమ సారం ఏమిటి అవుట్ పుట్ ఏంటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు అనే అంటున్నారు.
అవును నిజంగా అర్థం కావడం లేదు. జగన్ మాట్లాడుతున్నది పార్టీ వారికే అర్ధం కావడం లేదు అని అంటున్నారు. జగన్ ఓటమి తరువాత వరసబెట్టి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ అందులో అంతిమ సారం ఏమిటి అవుట్ పుట్ ఏంటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు అనే అంటున్నారు.
ఓటమి వెనక వంద కారణాలు ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవాలి. ఆత్మ శోధన చేసుకోవాలి. ఓటమి మీద పోస్ట్ మార్టం నిజాయతీగా జరగాలి. అసలు ఎందుకు ఓడాం అన్నది ఆయన క్యాడర్ ని అడిగితే చాలా బాగా తెలుస్తుంది అని అంటున్నారు. కానీ ఎవరినీ మాట్లాడనీయకుండా అంతా తానే మాట్లాడుతూ పోతున్నారు.
శ్రీకృష్ణుడు అంటారు, పాండవులు అంటారు, శకుని పాచికలు అంటారు. మళ్ళీ మనమే గెలుస్తామని అంటారు. అదే సమయంలో సినిమా పోలికలు తెస్తారు. ఇప్పటికి ఇంటర్వెల్ మాత్రమే అని తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతలకు చెప్పారు. ఇది మరీ వింతగా ఉందని అంటున్నారు.
ఇంటర్వెల్ అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా అర్ధం కావాలి కదా జగన్ సార్ అని అంటున్నారు. ఇంటర్వెల్ కే పార్టీని దారుణంగా ఓడించేశారు. మరి సినిమా క్లైమాక్స్ కి చేరితే ఏమి జరుగుతుంది అసలు ఉనికి ఉంటుందా అన్న సెటైర్లు అయితే సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. జగన్ మాట్లాడుతున్న ప్రతీ మాటా ఇపుడు సోషల్ మీడియాకు అస్త్రంగా మారుతోంది అంటే అధినేత భారీ ఓటమిని సీరియస్ గా తీసుకోవడం లేదనే అంటున్నారు. అంతే కాదు సరైన పోస్ట్ మార్టం చేయడం లేదని అంటున్నారు.
జగన్ కి ఓటమి విషయంలో ఈ రోజుకీ క్లారిటీ రాకపోవడమే అసలైన సమస్య అని అంటున్నారు. ఎంతసేపూ ప్రజలకు చాలా చేశామని విశ్వసనీయత అంటూ పడికట్టు పదాలను జగన్ మాట్లాడుతున్నారు. జనాలకు ఇవి బొత్తిగా ఎక్కేవి కావు అని అంటున్నారు. రాజకీయాల్లో అసలు కుదరవని కూడా అంటున్నారు.
ప్రజలు అన్ని విషయాలూ చూసే తీర్పు ఇస్తారు. ప్రజలకు చేసిన మంచి ఉంది కాబట్టే 40 శాతం ఓట్లు వచ్చాయి. ఆ పోయిన అరవై శాతం ఓట్ల గురించి కదా జగన్ పోస్ట్ మార్టం చేయాల్సింది అని అంటున్నారు అంతే కాదు ఓటమిని పెద్ద విషయం కాకుండా ఎంతోసేపూ లైట్ తీసుకోవడం ద్వారానే వైసీపీ అధినాయకత్వం మరింత ఇబ్బంది పడుతోందని అంటున్నారు.
వాస్తవానికి చూస్తే అసలు సమస్యలు చాలా పార్టీలో ఉన్నాయి. జగన్ అసలు ఎందుకు ఓడారు అంటే దానికి బోల్డ్ గా వచ్చే ఆన్సర్ ఏంటి అంటే జగనే జగన్ని ఓడించుకున్నారు అని. ఈ అన్స్వర్ లోనే ఎన్నో విషయాలు కనిపిస్తాయి. జగన్ వ్యవహార శైలి, పార్టీ పట్ల ఆయన చూపించిన ఉదాశీనత, క్యాడర్ పట్ల నిర్లక్ష్యం ఇలా అన్నీ కలిపే జగన్ ద్వారా వైసీపీని ఓడించాయని చెప్పేవారు ఉన్నరు.
క్యాడర్ తోనే ఏ పార్టీ అయినా నిర్మాణం ఉంటుంది. పార్టీని నమ్ముకోవాలి, వారినే పునాదులుగా చేసుకోవాలి. అంతే తప్ప పార్టీని గాలికి వదిలేసి కొంతమంది కోటరీతోనే అంతా నడిపించారు అని అంటున్నారు. అంతే కాదు వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వారినే పెద్దలుగా చూపించారు వారితోనే అంతా అనిపించారు.
ఇవన్నీ కదా ఇపుడు చర్చించాల్సింది అని అంటున్నారు. పార్టీ క్యాడర్ మనసులో చాలా ఉన్నాయి. ఓటమి ఎందుకు జరిగింది అన్నది వారికి బాగా తెలుసు అంటున్నారు. ఇవేమీ కాకుండా పై పై మాటలతో పాటు పార్టీ మళ్లీ లేస్తుంది, గెలుపు చూస్తాం, రికార్డు మెజారిటీతో అధికారంలోకి వస్తామంటే క్యాడర్ కే నమ్మకం కుదరదని అంటున్నారు.
నిజం చెప్పాలంటే మా పార్టీ అని క్యాడర్ సొంతం చేసుకోవడం మానేసి చాలా కాలమే అయింది. వారు కాడె వదిలేయబట్టే తాజా ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడింది. అలాగే లీడర్స్ కి క్యాడర్ కి మధ్య గ్యాప్ ఉంది. అదే విధంగా లీడర్స్ కి పార్టీ అధినాయకత్వానికి మధ్య గాప్ ఉంది. ఇలా పార్టీలో సమర్ధవంతమైన నిర్మాణం జరగక డొల్లతనం కనిపిస్తుంది.
మరి వీటిని కదా జగన్ సార్ ప్రస్తావించాలి అని అంటున్నారు. కానీ వాటిని వదిలేసి మనమే గెలుస్తాం, టీడీపీ కూటమి తప్పులు చేస్తుంది అని జగన్ చెప్పడం పట్ల పార్టీలో అయితే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇన్ని రకాలుగా సమీక్షలు జగన్ చేసినా క్యాడర్ లో అయితే జోష్ తీసుకుని రాలేకపోయారు అంటే అసలు సమస్య అలాగే ఉంది కదా అని అంటున్నారు.
ఈ రోజుకు అయినా నాయకులను మాట్లాడించాలి. వారికి పూర్తి స్వేచ్చను ఇచ్చి బాధ్యతలు అప్పగించాలి. అలాగే క్యాడర్ ని విశ్వాసంలోకి తీసుకొవాలి. వారిలో భరోసా కల్పించాలి. పార్టీని తిరిగి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టలని అంటున్నారు. ఎస్ తప్పు జరిగింది అని ఒప్పుకోవడం ద్వారానే వైసీపీ అధినాయకత్వం మనగలుతుందని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ హానీమూన్ ముగిస్తే మనకే పట్టం కడతారు జనాలు అని అనుకోవడం భ్రమలలో బతకడమే అంటున్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయని వైసీపీ పెద్దలు మరచిపోతే తప్పు వారిదే తప్ప ప్రజలదు కాదని అంటున్నారు.