జగన్ అన్న షర్మిల చెల్లి మధ్యలో రాహుల్ గాంధీ...స్టోరీ ఏంటి ?

ఇదిలా ఉంటే 22 మంది ఎంపీలు ఉన్నా రాజ్యసభలో బలం ఉన్నా బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండడంతో జగన్ ఏమీ చేయలేకపోయారు.

Update: 2024-06-17 04:02 GMT
జగన్ అన్న షర్మిల చెల్లి మధ్యలో రాహుల్ గాంధీ...స్టోరీ ఏంటి ?
  • whatsapp icon

తాజా ఎన్నికల్లో దారుణంగా పార్టీ ఓడి మాజీ సీఎం అయిన అన్న ఒక వైపు కాంగ్రెస్ వైపు వెళ్ళి అన్నను ఓడించిన చెల్లెలు మరో వైపు ఈ మధ్యలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏంటి కధ అని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి అయిదేళ్ల క్రితం వేళ్తే 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు 22 మంది ఎంపీలు దక్కడంతో రాజ్యసభలో ఏపీ నుంచి మొత్తం కోటా 11 మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు.

ఇదిలా ఉంటే 22 మంది ఎంపీలు ఉన్నా రాజ్యసభలో బలం ఉన్నా బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండడంతో జగన్ ఏమీ చేయలేకపోయారు. ఇక 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్నారని ప్రజలకు నాయకులను క్యాడర్ ని పట్టించుకోకుండా జగన్ వ్యవహరించారు అని అంటారు. అతి విశ్వాసంతో ఆయన చేసిన రాజకీయం మూలంగా తాజా ఎన్నికల్లో దెబ్బ పడింది.

ఇక క్యాడర్ ని పక్కన పెట్టి వాలంటీర్లను తెచ్చారు. అలాగే అప్పులు దండీగా తెచ్చి జనాలకు పధకాల రూపంలో పంచేశారు. అవే తమకు పెట్టని కోటగా ఉంటాయని తమ ఓట్లు అవే అని భావించి యువతను ప్రభుత్వ ఉద్యోగులను అలాగే పెన్షనర్లను మధ్య తరగతి వర్గాలను ఉన్నత వర్గాలను అలాగే చదువుకున్న వారిని ఇలా వివిధ వర్గాలను ఏ మాత్రం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

వీటికి తోడు పేదలు అని పెత్తందారులు అని కామ్రేడ్స్ ఎపుడో వాడి వదిలేసిన పడికట్టు పదాలతో జనాలను అయోమయానికి జగన్ గురి చేశారు. ఇక సంక్షేమ పధకాలు కూడా అందరికీ కాకుండా కొందరికి ఇవ్వడం వల్ల యాభై శాతం పైగా కులాల వారు గుర్రు మీద ఉండడం జరిగింది. అలా వారంతా బాధపడేలా పాలన సాగింది అని కూడా విమర్శలు వచ్చాయి.

తన ఫోటో చూసి మాత్రమే ఓట్లు పడతాయని ఎన్నికల సమయంలో ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పడం ద్వారా క్యాడర్ ని అధినాయకుడే అవమానపరచారు అని అంటున్నారు. అంతే కాదు సొంత చెల్లిని తల్లిని దూరం పెట్టి దూరం చుట్టాలని దగ్గరకు తీసిన వైనం కూడా జనాలకు నచ్చలేదు. అంతదాకా ఎందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద హత్యారోపణలు ఉంటే ఆయన్ని గట్టిగా సమర్థించడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారు.

రాజకీయం అంటే షార్ట్ కట్ మెదడ్ వాలంటీర్ల వ్యవస్థ అని డబ్బులు పంచుతూ పధకాలు చేస్తే అదే సాగిపోతుందని కొత్త పొలిటికల్ ఫిలాసఫీని కనుగొనబోయి జగన్ బోల్తా కొట్టారు అని అంటున్నారు. చంద్రబాబుని చాలా తక్కువ చేసి చూడడం వల్లనే ఆయన తన సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో చూపించారు అని అంటున్నారు.

కేవలం రెండు ఎకరాల ఆసామి నుంచి ఈ రోజు ఇంతటి స్థాయికి వచ్చి నాలుగున్నర సుదీర్ఘ రాజకీయ అనుభవం గడిచిన బాబు ఢక్కా మెక్కీలు తిన్న నాయకుడు. ఆయన రాజకీయ జీవితం గురించి సరైన అంచనా వేయలేకపోయారు జగన్ అని అంటున్నారు. తన చేతిలో ఉన్న నలుగురు మంత్రులతో బాబుని తిట్టించి అందులో ఆనందం పొందడమే రాజకీయం అనుకోవడం వల్లనే ఇలా ఫలితాలు వచ్చాయని అంటున్నారు.

ఇలా పొరపాట్లూ తడబాట్లూ తప్పులూ లెక్కలేనన్ని చేయడం వల్లనే వైసీపీ ఘోరంగా తాజా ఎన్నికల్లో దెబ్బ తిందని అంటున్నారు. ఇక ఇంతలా రాజకీయం అడ్డంగా తిరిగిన వేళ జగన్ బీజేపీతో మైత్రి సంబంధాలు నడుపుదామని అనుకున్నా అసలు కుదిరే వ్యవహారంగా లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే చంద్రబాబుకు లోక్ సభలో పదహారు మంది ఎంపీల బలం ఉంది.

జగన్ కి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడాలీ అంటే బాబు మద్దతు తప్పనిసరి. బాబుని కాదని జగన్ ని బీజేపీ పెద్దలు చేరదీస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని దించడానికి టీడీపీకి అరక్షణం కూడా పట్టదని అంటున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ కి జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక ఆప్షన్ ఇండియా కూటమి మాత్రమే అని అంటున్నారు. ఇండియా కూటమి గతం కంటే బలంగా ఉంది. జగన్ కూడా గతంలో మాదిరిగా సింగిల్ గా అంటూ స్లొగన్స్ ఇస్తే కుదిరే వ్యవహారం కాదు. ఏదో ఒక వైపు జట్టు కట్టాలి. తన తల్లిని చెల్లెలును కలుపుకుని పోవాలి. రాహుల్ గంధీ ద్వారా ఇండియా కూటమికి మంచి నేస్తంగా మారాలి. అపుడు క్యాడర్ కి మంచి సందేశం వెళ్తుంది. పార్టీ నేతలకు కూడా భరోసా వస్తుంది.

అంతే కాదు తల్లి చెల్లెలును వెంటబెట్టుకుని వైఎస్సార్ కుటుంబం అంతా ఒక్కటి అన్న సందేశం కూడా ఇస్తే తప్ప జనాలు కూడా నమ్మేది ఉండదని అంటున్నారు. ఇపుడున్న విపత్కరమైన పరిస్థితుల్లో జగన్ ని రాహుల్ గాంధీ కుటుంబం మాత్రమే కాపాడుతుంది అని అంటున్నారు. గతంలో మాదిరిగా ఈడీ సీబీఐ కేసులు విపక్షాల మీద పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాహసించేది కూడా అపుడు ఉండదు. బలంగా ఉన్న ఇండియా కూటమిలో కనుక జగన్ చేరితే తప్పకుండా ఆయనకు తగిన రక్షణ కూడా దొరుకుతుంది అని అంటున్నారు.

ఇండియా కూటమి సపోర్ట్ అలాగే కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ అండ ఉంటే తప్ప ఏపీలో ఒంటరిగా రాజకీయం చేస్తే తట్టుకోవడం జగన్ వల్ల కానే కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఇపుడు క్యాడర్ కూడా పెద్దగా వైసీపీకి లేదు, ఏ రకమైన ఎమోషన్స్ లేవు. సెంటిమెంట్ అన్నది తెచ్చినా వర్కౌట్ అయ్యేది అసలు లేదు.

అందువల్ల జగన్ ఈ సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోవడం అంటే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడం అలాగే కాంగ్రెస్ తో తిరిగి మంచి సంబంధాలు నెరపడం అని అంటున్నారు. మరి జగన్ ఏమి ఆలోచిస్తారో తెలియదు కానీ ఉన్న ఏకైన దారి మాత్రం ఇదే అని అంటున్నారు.

Tags:    

Similar News