విలువలు విడిచిపెట్టిన విపక్షాలు... స్టీల్ ప్లాంట్ పై జగన్ కీలక వ్యాఖ్యలు!

అవును... ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం కూడా అత్యంత కీలకమైన విషయమే.

Update: 2024-04-23 07:39 GMT

ఎన్నికల వేళ ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటనేది తెలిసిన విషయమే. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీతో జతకట్టిన టీడీపీ - జనసేనల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేని పరిస్థితి! మోడీని కాదని సొంతంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితిలో టీడీపీ - జనసేన నేతలు లేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.

అవును... ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం కూడా అత్యంత కీలకమైన విషయమే. ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్తుందని, తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆరు నెలల్లోనే అమ్మకం కన్ ఫాం అని చెబుతున్నారు! ఈ సమయంలో స్పందించిన వైఎస్ జగన్... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని తెలిపారు.

"మేమంతా సిద్ధం" యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం వారితో మాట్లాడిన జగన్... స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ఇదే సమయంలో... ఈ సమస్యపై మొట్టమొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందని గుర్తు చేసిన జగన్... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం.. తొలిసారిగా ప్రధానికి లేఖ రాయడంతో పాటు.. ఈ అంశంపై పరిష్కారాలు కూడా సూచించినట్లు తెలిపారు. ఇదే సమయంలో కూటమిగా ఏర్పడిన విపక్షాలపైనా విమర్శలు చేశారు జగన్.

ఇందులో భాగంగా... ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టుకట్టాయని.. కూటమిగా ఏర్పడ్డాయని చెప్పిన జగన్... విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో... ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకే ఉందని తెలిపిన జగన్... తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News