మరో అయిదేళ్ళు పెంచిన పవన్...అందరికీ ఓకేనా ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్స్ లో రాజకీయ పాళ్ళు తక్కువగా ఉంటాయి. ఆయన తన మనసులో ఏముందో అదే చెబుతారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్స్ లో రాజకీయ పాళ్ళు తక్కువగా ఉంటాయి. ఆయన తన మనసులో ఏముందో అదే చెబుతారు. అలా ఆయన చెప్పేటపుడు ఏ రాజకీయ గణితాన్ని పట్టించుకోరు. లెక్కలు కూడా వేసుకోరు అని అంటారు.
లేటెస్ట్ గా అసెంబ్లీలో పవన్ ఇచ్చిన ఒక సంచలన స్టేట్మెంట్ ని అలాగే చూడాలని అంటున్నారు. ఇంతకీ పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ సంగతేంటి అంటే ఏపీలో పదిహేనేళ్ళ పాటు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండాలని. అంటే 2039 వరకూ ఇదే కూటమి పాలన సాగాలన్నది పవన్ గట్టి సంకల్పంతో ఇచ్చిన స్టేట్మెంట్ అన్న మాట.
సరిగ్గా కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఇదే పవన్ పదేళ్ళ పాటు చంద్రబాబే సీఎం అని ఒక భారీ ప్రకటన చేశారు. ఇపుడు మరో అయిదేళ్ళు ఆయన పెంచారు. పవన్ ఈ విధంగా చెప్పడానికి కారణం ఏపీ అభివృద్ధి కోణమే తప్ప రాజకీయం ఇందులో లేదని అంటున్నారు. ఒకే పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ నిరంతరంగా కొనసాగితేనే తప్ప ఏపీ అభివృద్ధి సాధించదు అన్న ఆలోచనతో ఆయన ఈ విధంగా చెబుతున్నారు అని భావించాలి. ప్రతీ అయిదేళ్ళూ ప్రభుత్వాలు మారితే ఆయా పార్టీల ప్రాధాన్యతలు మారి పరిస్థితి ఎపుడూ మొదటికే వస్తుందన్న ఆలోచనతో ఆయన చెప్పారని అనుకోవాలి.
అయితే ఆయన కిందా పడ్డా మీద పడ్డా మాది అంతా ఒకే కుటుంబం. అంతా కలసే ఉంటాం, మేము అలా ఐక్యంగానే ముందుకు వెళ్తామని ఇచ్చిన ఈ ప్రకటనతో జనసేన టీడీపీ బీజేపీ దిగువ స్థాయి వర్గాలు శ్రేణులు కూడా అర్ధం చేసుకుని ముందుకు సాగాలన్న సంకేతం ఉంది. అదే విధంగా ఏపీలో ఎన్డీయే కూటమి తప్ప మరోసారి వైసీపీ రానే రాదు అన్న హెచ్చరిక ఉంది.
అంతే కాకుండా రాజకీయాల కోసం కాకుండా పవన్ ఏపీ భవిష్యత్తు కోసమే ఈ ప్రకటన చేశారన్న సూచన కూడా ఉంది. ఇదిలా ఉంటే పదిహేనేళ్ల పాటు ఎన్డీయే ప్రభుత్వం అంటే అందులో సీఎం గా ఎవరు ఉంటారు అన్నది మాత్రం పవన్ చెప్పలేదు. ఒక విధంగా అదిప్పుడు అప్రస్తుతం కూడా. ఆ అవసరమే లేదు కూడా. గతసారి పదేళ్ళ పాటు బాబు సీఎం అని పవన్ అన్నారు. అపుడు కొంత అసంతృప్తి అయితే ఆయన సామాజిక వర్గం నుంచి పార్టీ క్యాడర్ నుంచి వచ్చిందని ప్రచారం సాగింది.
దాంతో ఈసారి పవన్ సీఎం ఎవరు అన్నది చెప్పకుండా ఎన్డీయే ప్రభుత్వం అని మాత్రమే అంటున్నారు. అంటే ఎవరు నాయకత్వం వహించినా మూడు పార్టీల ప్రభుత్వం ఏపీలో ఉంటుంది అన్నది అంతరార్ధంగా ఉందని అంటున్నారు. ఇక పదేళ్ళ పాటు బాబు సీఎం గా ఉండాలని పాత ప్రకటనకు కొనసాగింపుగానే ఈ ప్రకటన ఇచ్చి ఉంటారని అంటున్నారు. అంటే పదేళ్ళ పాటు బాబు సీఎం గా ఉన్నా ఆ మిగిలిన అయిదేళ్ళలో పవన్ కి చాన్స్ ఉంటుందని కూడా అనుకోవచ్చు అని అంటున్నారు.
లేదా ఎన్డీయే ప్రభుత్వం అన్నారు కాబట్టి ఒక టెర్మ్ టీడీపీకి సీఎం పదవి వెళ్ళినా మరో టెర్మ్ జనసేన తీసుకోవడానికి కూడా చాన్స్ ఉంటుందని ఒక బలమైన సామాజిక వర్గంలో ఆశలు అలాగే సజీవంగా ఉంచారని అంటున్నారు. అంతే కాదు పార్టీ క్యాడర్ కి ఇది అంతర్లీనంగా సందేశంగా ఉందని అంటున్నారు.
అయితే ఈ ప్రకటనలో ఎవరికి వారు ఏ అర్ధం తీసుకున్నా ఇబ్బంది లేనట్లుగానే ఉంది. కానీ కూటములు కట్టేటపుడు పెద్దన్న పార్టీలలో ఉండే పార్టీలకే నాయకత్వాలు సహజంగా వెళ్తాయి. అందువల్ల జనసేన అధినేత ఇచ్చిన ఈ ప్రకటనతో జనసేన కూడా బలమైన పార్టీగా ఫ్యూచర్ లో కూటమిలో కీలక పాత్ర పోషించవచ్చు అన్నది కూడా ఉందని చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే పవన్ ఇచ్చిన ఈ ప్రకటన కూటమిలోని మిగిలిన రెండు పార్టీలతో పాటు బలమైన సామాజిక వర్గానికి అలాగే జనసేన క్యాడర్ కి ఓకేనా అంటే ఎవరికి వారు ఆలోచించుకునే దాని బట్టే ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో వైసీపీకి నో చాన్స్ అన్న పక్కా క్లారిటీతో మేసేజ్ ని పవన్ ఇచ్చేశారు అని మాత్రం అంటున్నారు.