ఓటమిని ఒప్పుకోని జగన్..హాట్ కామెంట్స్!

కానీ, మాజీ సీఎం జగన్ మాత్రం వైసీపీపై వ్యతిరేకత వల్ల తాము ఓడిపోలేదని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-04 10:56 GMT

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఉండడం వల్లే ఆయన ఓడిపోయారని వైసీపీ నేతలు మొదలు రాజకీయ విశ్లేషకులు వరకు అందరూ చెబుతున్నారు. కానీ, మాజీ సీఎం జగన్ మాత్రం వైసీపీపై వ్యతిరేకత వల్ల తాము ఓడిపోలేదని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని, వ్యతిరేకతతో ఓడిపోలేదని జగన్ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులై ఓటు వేశారని, 10 శాతం ఓట్లు అటు వెళ్లడంతోనే చంద్రబాబు గెలిచారని జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

తల్లికి వందనం, రైతు భరోసా పథకాలను ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. నెలకు 1500 చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారని మహిళలు చంద్రబాబును అడుగుతున్నారని జగన్ అన్నారు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు.

హామీలు నిలబెట్టుకోవడంపై చంద్రబాబు శ్రద్ధ చూపించాలని, అలా కాకుండా భయాందోళనలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి వైసిపి నేతలను వేధించడంపై కాదని జగన్ అన్నారు. దుర్మార్గపు ఆలోచనలతో చంద్రబాబు అడుగులు వేయడం ఏం రాజకీయమని విమర్శించారు. ప్రజలు తనకు ఎందుకు ఓటు వేశారో చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్ హితవు పలికారు. అయితే, ప్రజావ్యతిరేకత ఉండటం వల్లే వైసీపీ ఓడిపోయింది అన్న విషయాన్ని మాత్రం జగన్ అంగీకరించడం లేదు.

దీంతో, జగన్ తాజా కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ఓటమికి కారణాలను విశ్లేషించుకుని ముందుకు పోతేనే రాబోయే ఎన్నికల్లో అయినా జగన్ గెలిచే అవకాశాలు ఉంటాయని, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోతే ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితి ఉండదని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News