డిఫెన్స్ లో జగన్!
అధికారంలో ఉన్నప్పుడు.. ఐదేళ్లు మీడియాను తాడేపల్లి ఛాయలకు కూడా రానివ్వలేదు.
అధికారంలో ఉన్నప్పుడు.. ఐదేళ్లు మీడియాను తాడేపల్లి ఛాయలకు కూడా రానివ్వలేదు. మీడియాతో మాట్లాడండి.. అని పార్టీనాయకులు చెప్పారో లేదో తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రి, భయపడుతున్న ముఖ్యమంత్రి అంటూ.. కామెంట్లు జోరుగా వినిపించా యి. అయినా.. జగన్ అప్పట్లో మీడియా ముందుకు రాలేదు. ఎప్పుడైనా అవసరమైనా.. ఆయన జాతీయ మీడియాను పిలిపించుకుని దాంతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయే తప్ప.. లోకల్ మీడియాను పట్టించుకోలేదు.
దీంతో ఐదేళ్లు గడిచిపోయాయి. బహిరంగ సభల్లో మాట్లాడడం.. ఆ వెంటనే చిలుక గూటిలోకి వెళ్లిపోయినట్టుగా.. తాను తాడేపల్లి ఇంటికే పరిమితమై పోయారు. ఇక, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత.. తెలుగు మీడియా ఇప్పుడు ఆయనకు కనిపించింది. తొలిసారి తెలుగు రాష్ట్రాల మీడియాను ఆయన తాడేపల్లిలోకి అనుమతించారు. అది కూడా కెమెరాలు తీసుకురావద్దంటూ.. ఆదేశాలు జారీ చేశారు. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే రావాలని సూచించారు.
సరే.. ఏదో ఒకటి అనుకున్న మీడియా సంస్థలు ప్రతినిధులను పంపించాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. గతంలో ఏ మీడియాను అయితే.. ఆయన తిట్టిపోశారో.. ఇప్పుడుకూడా అదే పంథా అనుసరించారు. తనను ఇంకా వెంటాడుతున్నాయని.. తప్పులు వెతుకుతున్నాయని చెప్పుకొచ్చారు. కానీ, ఆ వెంటనే ``బాధ్యతాయుతంగా విలేకరులు వ్యవహరించాలి. వాస్తవాలను ప్రజలకు వెల్లడించడంలో సహాయం చేయాలి`` అని జగన్ కోరారు. దాదాపు గంటకుపైగా.. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
ఈ పరిణామాలు చూసిన తర్వాత.. జగన్ డిఫెన్స్‌లో పడ్డారనే కామెంట్లు వినిపించాయి. ఒకప్పుడు మీడి యాను పట్టించుకోకుండా.. వారిపై ఆంక్షలు పెట్టడం, కేసులు పెట్టడం తెలిసిందే. కానీ.. కాలం గడిచే సరికి.. అదే మీడియాను జగన్ అభ్యర్థించే పరిస్థితికి రావడం.. తనకు సాయంగా ఉండాలని కోరడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం, మీడియా కనిపించాయా? అని కొందరు వ్యాఖ్యానించగా.. ఇప్పటికైనా మార్పు వచ్చిందే! అని మరికొందరు వ్యాఖ్యానించారు.