వ్యవస్థల మీద జగన్... లోకేష్ తాజా కామెంట్స్ ఇంటరెస్టింగ్...!
ముందుగా ముఖ్యమంత్రి జగన్ విషయం తీసుకుంటే ఆయన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మాత్లాడుతూ అరాచకశక్తులు అవకాశం ఇవ్వరాదని పోలీసులకు ఉద్బోధించారు.
ఏపీలో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ టీడీపీల మధ్యలో సాగుతోంది. రాజకీయ చదరంగం మాదిరిగానే ఇది ఎత్తులు పై ఎత్తులతో సాగుతోంది. ఇక వైసీపీ వేసిన ఒక ఎత్తుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్ చెప్పేశారు. ఆయన నలభై మూడు రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే బాబు లాంటి రాజకీయ ఘనాపాటి ఎందుకు ఇలా జైలులో రోజుల తరబడి గడపాల్సి వస్తోంది అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు.
దీని మీద ఎవరి మటుకు వారు చర్చోపచర్చలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబుని రాజకీయ కక్షతో వైసీపీ ఇలా చేయిస్తోంది అంటూంటే వైసీపీ ఇదంతా న్యాయ ప్రక్రియలో భాగం అంటోంది. ఈ నేపధ్యంలో చూస్తే బాబు జైలులో ఉండడానికి అసలైన కారణాలు ఏమిటి అన్నవి ఎవరి ఆలోచనల మేరకు వారివిగా ఉంటున్నాయి.
ఏపీలో చూసుకుంటే అయిదు కోట్ల మంది ప్రజలలో తటస్థులు మేధావులు సైతం ఈ కేసులో ఏమి జరుగుతోంది అని ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇద్దరూ ఒకే రోజు వేరు వేరు సందర్భాలలో వ్యవస్థల మీద చేసిన కామెంట్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.
ముందుగా ముఖ్యమంత్రి జగన్ విషయం తీసుకుంటే ఆయన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మాత్లాడుతూ అరాచకశక్తులు అవకాశం ఇవ్వరాదని పోలీసులకు ఉద్బోధించారు. ప్రజా స్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాల అర్థం అంటే ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని, పోలీసులు, న్యాయస్థానం నుంచి లాక్కోవటం కాదని జగన్ సరికొత్త సందేశం ఇచ్చారు.
ఆయన చంద్రబాబు పేరు ఎత్తలేదు కానీ వర్తమాన రాజకీయాల మీదనే ఈ విమర్శలు చేశారు. అవినీతి చేసి నేరాలు చేసి ఆపై ఆధారాలు అన్నీ చూసిన తర్వాత న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వక పోతే న్యాయ మూర్తుల మీద ట్రోలింగ్ చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏదీ అనుకూలం కాకపోతే వ్యవస్థల మీదనే టార్గెట్ చేస్తున్నారని ఇలాంటివి ఉపేక్షించరాదని ఆయన కోరారు.
అంతే కాదు పోలీసుల మీదనే నేరుగా దాడులు చేసే వారు పెరిగారు అని వారికి కట్టడి చేయడం విషయంలో పోలీసులు ఎక్కడా రాజీ పడరాదు అని ఆయన కోరారు. ఇలా జగన్ సమాజంలో వ్యవస్థల మీద దాడులు చేస్తూ అశాంతిని రేకెత్తించే దుర్మార్గుల విషయంలో మొహమాటాలు వీడి కఠినంగా పోలీసులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.
జగన్ ఇలా తన ప్రసంగం చేస్తూ టీడీపీని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తే నారా లోకేష్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రిని 43 రోజుల పాటు జైలు గోడల మధ్యన అన్యాయంగా నిర్బంధించారని మండిపడ్డారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ద్వారానే ఇలా చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. తన తండ్రి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తూ వచ్చారని, అలాంటి ప్రజా నాయకుడిని జైలులో ఉంచడం ద్వారా వైసీపీ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అన్నారు.
ప్రజలు ఇవన్నీ గమనించాలని ఆలోచించాలని ఆయన కోరారు. ఇందిరాగాంధీనే ఎదిరించిన పార్టీ టీడీపీ అని, అలాంటిది జగన్ కి భయపడుతుందా అని లోకేష్ అంటున్నారు. కచ్చితంగా తాము పోరాటమే చేస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇలా చూసుకుంటే అటు జగన్ కానీ ఇటు లోకేష్ కానీ వ్యవస్థల గురించే చెబుతూ వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అవతల పక్షం మీద విరుచుకుపడుతున్నారు.
మరి వ్యవస్థలను ఎవరు నిర్వీర్యం చేస్తున్నారు. ఎవరు మ్యానేజ్ చేస్తున్నారు. ఎవరు వ్యవస్థలను ట్రోలింగ్ చేసి కించపరుస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు బాగా తెలుసు అంటున్నారు. మనలను ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్నారని అధికార విపక్ష నాయకులు ప్రత్యర్ధుల మీద విమర్శలు సంధిస్తున్నారు.
మరి వైసీపీ టీడీపీ చెబుతున్న దాంట్లో సారమెంత సత్యమెంత అసలు విషయాలు ఏమిటి అన్నది సగటు ప్రజలకు తెలుస్తున్నాయా అన్నది చర్చ. ఏది ఏమైనా చట్టం రూల్ ఆఫ్ లా గురించి సీఎం జగన్ చెబుతూ అది పనిచేసుకుని పోవాలని అంటున్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తోంది అధికార పార్టీ అని లోకేష్ మండిపడుతున్నారు. ఇంతకీ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయంగా ఉంది మరి.