కేసీఆర్ దేశాన్ని శాసిస్తారు: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘నువ్వు చీఫ్ మినిష్టర్ వా.. కటింగ్ మాస్టర్ వా’’ అని రైతు భరోసా, రుణమాఫీ పథకాల అమలును ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్ జపం లేనిదే రేవంత్ ఉండరని, రేవంత్ రెడ్డి అబద్దాల కోరు అని విమర్శించారు. రైతులందరికీ పూర్తిగా రూ.2 లక్షల రుణమాఫీ చేశామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారని, అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
13 నెలల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీలు కాదు అర గ్యారెంటీ అమలైందని కేటీఆర్ సెటైర్లు వేశారు. తులం బంగారం, రైతు భరోసా, ఏకకాలంలో రుణమాఫీలపై రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో అడ్డగోలు, పనికిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని చురకలంటించారు. తులం బంగారం పథకం ఇచ్చేందుకు బంగారం దొరుకుతలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నా ఒరిగింది గుండు సున్నా అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో విచిత్రమైన పరిస్థితి ఉందని, అందుకే ఆ పార్టీలకు అన్ని సీట్లు వచ్చాయని అన్నారు.
సీఎం చంద్రబాబు, సీఎం నితీశ్ కుమార్ ల మాదిరిగా కేసీఆర్ కూ టైం వస్తుందని, ఆయన దేశాన్ని శాసించే రోజులు వస్తాయని కేటీఆర్ అన్నారు. అయితే, నేతల అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్ల వల్లే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని కేటీఆర్ అన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆ తప్పులు రిపీట్ చేయవద్దని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ క్యాడర్ అధైర్యపడొద్దని, అధికారులు, పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన రాసిపెట్టుకోవాలని, మన ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిద్దామని కేడర్‌కు కేటీఆర్ ధైర్యం చెప్పారు.