ఎస్సీ ఓటు బ్యాంకుపై జగన్ స్కెచ్ మామూలుగా లేదే...!
రాష్ట్రంలోని ఎస్సీ ఓటు బ్యాంకును తనకు పదిలం చేసుకునేందుకు వైసీపీ మరింత ముమ్మర ప్రయత్నా లు చేస్తోంది.
రాష్ట్రంలోని ఎస్సీ ఓటు బ్యాంకును తనకు పదిలం చేసుకునేందుకు వైసీపీ మరింత ముమ్మర ప్రయత్నా లు చేస్తోంది. వాస్తవానికి ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన పథకాల కారణంగా ఎస్సీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. తర్వాత.. కాలంలో ఇది వైసీపీకి మళ్లింది. అప్పటి నుంచి ఎస్సీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ నెగ్గుతూ వస్తోంది. 2019లో కూడా వైసీపీ భారీ సంఖ్యలో ఎస్సీ నియోజకవర్గాల్లో పాగా వేసింది.
ఇక, ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు కదలబారకుండా.. వైసీపీ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఎస్సీల ఆరాధ్య దైవం.. రాజ్యాంగ నిర్మాత.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని దేశలోనే ఎక్కడా లేనంత ఎత్తులో విజయవాడలో నిర్మించారు. దీనిని ఈ నెలలోనే సీఎం జగన్ ప్రారంభించనున్నారు. వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేడ్కర్ స్మృతి వనం పేరుతో అమరావతిలో ఏర్పాట్లు చేసింది. వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది.
కానీ, ఇదికార్య రూపం దాల్చే సరికి టీడీపీ సర్కారు పక్కకు తప్పుకొంది. ఇక, అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అమరావతిని కాదని విజయవాడ కేంద్రంగా నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లోనే అంబేడ్కర్ విగ్రహానికి శ్రీకారం చుట్టింది. సుమారు 400 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కేవలం విగ్రహమే కాకుండా.. స్మృతి వనం, లైబ్రరీ, పెద్ద ఆటస్థలం సహా ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది. దీనిని ఈ నెలలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు గ్రామాల్లో ప్రత్యేకంగా కార్యక్ర మాలు చేపట్టనున్నారు. అంతేకాదు.. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి సంబంధించి.. ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నారు. సీఎం జగన్ ప్రయత్నాలను కూడా ఎస్సీలకు వివరించనున్నారు. సుమారు రెండు వారాల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలు పాల్గొననున్నారు. మొత్తంగా ఎస్సీ ఓటు బ్యాంకు ను కోల్పోకుండా వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.