పాతికేళ్ళ సీఎం నేనే అంటున్న జగన్...!
ఇంకా పాతికేళ్ల పాటు ఏపీలో సంక్షేమ పాలన సాగాలంటే మళ్లీ జగనే అధికారంలోకి రావాలని ఆయన అనడం విశేషం.
వైఎస్ జగన్ 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర సందర్భంగా ఒక్క మాట ప్రతీ చోటా అంటూండేవారు. అదేంటి అంటే తాను ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు ముప్పయ్యేళ్ల పాటు సీఎం గా ఉంటాను అని. అలా జనాలు మెచ్చుకునేలా తన పాలన చేస్తాను అని. జగన్ ఇపుడు తొలి అయిదేళ్ళూ పూర్తి చేస్తున్నారు. ఇంకా బ్యాలెన్స్ పాతికేళ్ళు ఉంది అన్న మాట.
అందుకే జగన్ విశాఖ జిల్లా భీమిలీలో జరిగిన సిద్ధం ఎన్నికల శంఖారావంలో క్యాడర్ తో చెబుతూనే ప్రజలకు కూడా తాను అనుకున్నది చెప్పేశారు. ఇంకా పాతికేళ్ల పాటు ఏపీలో సంక్షేమ పాలన సాగాలంటే మళ్లీ జగనే అధికారంలోకి రావాలని ఆయన అనడం విశేషం.
జగన్ వస్తేనే పేదల ఇంట్లో ఆనందం ఉంటుదని, జగన్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని జగన్ అంటున్నారు. విపక్షాలు అధికారంలోకి వస్తే పెత్తందారుల పాలన వచ్చినట్లే అని జగన్ చెప్పారు. ఈ సందేశం ప్రతీ ఇంటా వినిపించాలని జగన్ కోరుతున్నారు.
ఇదిలా ఉంటే సిద్ధం సభలో జగన్ లోని ఆత్మ విశ్వాసం ప్రస్పుటంగా కనిపించింది. ఏపీలో ఆయన విపక్షాన్ని తేలికగానే తీసుకుంటున్నట్లుగా ఆయన ప్రసంగం సరళి చెబుతోంది. చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి అతనికి జనాలు అసలు ఓటు వేయరని జగన్ భావిస్తున్నారు. బాబు ఒంటరిగా రాలేరు, గెలవలేరు, అది ఆయన బలహీనత పొత్తులు కడితే కూడా కూటమికే ఇబ్బందులు వస్తాయి.
ఇలా అన్ని విషయాలను విశ్లేషించుకున్నట్లే జగన్ స్పీచ్ లో కనిపించింది. అందుకే ఆయన మరో పాతికేళ్ళ పాటు నేనే సీఎం అన్న ధీమాతోనే మాట్లాడారు. ప్రజలు తప్పకుండా వైసీపీని ఆదరిస్తారు అన్నది ఆయన బలమైన విశ్వాసంగా ఉంది. అందుకే ఆయన ప్రజలకు ఒక పిలుపు ఇస్తున్నారు తన అయిదేళ్ల పాలన చంద్రబాబు అయిదేళ్ల పాలన పోల్చి చూసుకోమంటున్నారు.
అదే విధంగా బాబు టైం లో పేదవారి ఇంట్లో బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం వేసిన సొమ్ము ఎంత జగన్ అయిదేళ్ల పాలనలో వేసిన సొమ్ము ఎంత అన్నది కూడా తేడా కట్టి మరీ చూసుకోమంటున్నారు. ఎంత కాదన్నా జగన్ వేసిన సొమ్మే ప్రతీ ఇంట్లో అధికంగా ఉంటుంది. పైగా ఒక్కో ఇంట్లో వివిధ పధకాల ద్వారా కనీసంగా రెండు నుంచి మూడు నాలుగు లక్షల రూపాయల దాకా కూడా అయిదేళ్లలో పడిన సందర్భాలూ ఉన్నాయి.
దాంతోనే జగన్ అంటున్న మాట ఒక్కటే. పేదలకు నేనే సీఎం గా ఉండాలని. చంద్రబాబు కనుక వస్తే మాత్రం అంతా తల్లకిందులు అవుతుందని, అంతే కాదు జగన్ ధీమా ఎంతలా ఉంది అంటే ఈసారి టీడీపీకి పాతిక సీట్లు కూడా రావని అంటున్నారు పైగా ఆయన కుప్పంలో ఓటమి పాలు అవుతారని, మొత్తం మీద జగన్ ఇంకో అయిదు టెర్ములు అంటే పాతికేళ్ల పాటు ఏపీకి తానే సీఎం అని సిద్ధం సభ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. మరి విపక్షాలు ఆ మాటను ఒప్పుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.