రోజుకు మూడు సభలు...కూటమి టార్గెట్ గా జగన్ !
ఈ సభలన్నీ మే 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగేలా నిరంతరంగా చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీడ్ పెంచుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రోజుకు ఒక మీటింగ్ కే పరిమితం అయిన జగన్ ఇక మీదట రోజుకు మూడు మీటింగ్స్ వీలుంటే నాలుగు సభలను కూడా నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సభలన్నీ మే 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగేలా నిరంతరంగా చేపట్టనున్నారు.
వైసీపీ అధినేత ఒక వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారాన్ని ఈసారి నిర్వహిస్తున్నారు. ఆయన చాలా కాలంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జనంలోకి వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రతీ స్కీం ద్వారా ఇచ్చే నగదుని
బటన్ నొక్కుతూ ఏపీలోని ఉమ్మడి విభజన జిల్లాలను ఒకటికి రెండు సార్లు కవర్ చేశారు.
ఇక ఎన్నికలు దగ్గరపడ్డాక కొత్త ఏడాదిలో సిద్ధం పేరుతో భారీ సభలను జగన్ శ్రీకారం చుట్టారు. ఇవి రీజియన్ వైజ్ గా సాగాయి. అలా నాలుగు చోట్ల భారీ సిద్ధం సభలను నిర్వహించారు. ఇక ఇపుడు చూస్తే మేమంతా సిద్ధం పేరుతో సిద్ధం సభలను కవర్ చేయని ప్రాంతాలలో భారీ సభలను నిర్వహిస్తున్నారు. ఇలా జిల్లాకు ఒక అతి పెద్ద సభను నిర్వహించడం ద్వారా వైసీపీ ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు తొక్కింది.
అదే విధంగా చూస్తే మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర ఈ నెల 24తో పూర్తి అవుతుంది. శ్రీకాకుళం జిల్లాతో ముగుస్తుంది. ఆ తరువాత ఈ నెల 25న పులివెందుల నుంచి జగన్ మరో ప్రచారానికి రెడీ అవుతున్నారు. హెలికాప్టర్ ద్వారా రోజుకు మూడు నుంచి నాలుగు సభలను ఆయన నిర్వహించనున్నరు. అలా యాభై నుంచి అరవై సభల దాకా నిర్వహించాలని వైసీపీ భారీ యాక్షన్ ప్లాన్ తో సిద్ధంగా ఉంది.
ఈ సభలనీ కూడా టీడీపీ కూటమిని గురి పెట్టడానికే అంటున్నారు. ఎక్కడైతే కూటమి గట్టిగా ఉందో అక్కడ ఈ సభలను నిర్వహించడం ద్వారా కూటని బలాన్ని తగ్గించాలన్నదే వైసీపీ ప్రయత్నంగా ఉంది అని అంటున్నారు.
అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా విగరస్ గా జగన్ ఏపీ అంతా చుట్టేస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలలోనే జగన్ సభలు ఎక్కువగా సాగుతాయని అంటున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఈ నేపధ్యంలో కూటమిని ఢీ కొట్టడంతో పాటు ఏపీలో గెలిచే పార్టీగా వైసీపీ ముందు వరసలో ఉందని చెప్పడమే జగన్ దూకుడు ప్రచారం ఉద్దేశ్యం అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జగన్ ఈ నెల 25న పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేస్తారు. అదే రోజున పులివెందులలో భారీ బహిరంగ సభను ఆయన నిర్వహిస్తారు అని అంటున్నారు. ఆ సభతో ఎమ్మెల్యే అభ్యర్ధిగా జగన్ పులివెందుల నుంచి మరోసారి భారీ ఆధిక్యతతో గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో 90 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీ జగన్ కి వచ్చింది. ఈసారి ఆ మెజారిటీని బీట్ చేస్తారా అన్నది ఉత్కంఠంగా మారింది.