జగన్ ఓదార్పు యాత్ర.. టైమ్ మారితే బెస్టేమో..!
వైసీపీ అధినేత జగన్.. త్వరలోనే ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలుచెబుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్.. త్వరలోనే ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలుచెబుతున్నాయి. రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత.. విడతల వారీగా అన్ని ప్రాంతాల నాయకులతోనూ జగన్ భేటీ అయ్యారు. ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుందని ఆయన వారితో చర్చించారు. మెజారిటీ నాయకులు ప్రజల్లోకి వెళ్లడమే బెటర్ అని సూచించారు. దీంతో మరోసారి ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారనే సంకేతాలు బయటకు వచ్చాయి.
ఈ యాత్రంలో అందరినీ కాకుండా.. ఎన్నికలకు ముందు.. తర్వాత.. ఇబ్బందులు పడిన , దాడుల్లో గాయ పడిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చాలని జగన్ నిర్ణయించుకున్నారు. వారికి భరోసా ఇవ్వడం ద్వారా.. పార్టీని తిరిగి లైన్‌లో పెట్టాలని భావిస్తున్నారు. అయితే.. ఇది మంచిదే అయినా.. ఇప్పటికప్పుడు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి రాదని అంటున్నారు పరిశీలకులు. పైగా.. ప్రజలు ఇంకా వైసీపీ పాలన ను మరిచిపోలేదని అంటున్నారు.
ముఖ్యంగా కొన్ని నెలలు గడిస్తే.. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఒక అవగాహన వస్తుందని.. తమ ఆకాం క్షలు నెరవేరకపోతే.. అప్పుడు సహజంగానే జగన్పై సానుభూతి, వైసీపీపై సింపతీ వస్తాయని.. అప్పుడు యాత్రలు చేస్తే మంచిదన్న సూచనలు పార్టీకి అందుతున్నాయి. అలా కాకుండా ఇప్పటికిప్పుడు యాత్రలు చేస్తే.. ప్రజల నుంచి స్పందన లేక పోగా.. అధికార పార్టీ నేతల నుంచి వ్యంగ్యాస్త్రాలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇక, పార్టీ కార్యకర్తలు కూడా.. ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో సహకరించడం కూడా కస్టమేనని అంటున్నారు.
ఇప్పుడు వైసీపీలో ఒక సంధి కాలం అయితే.. నడుస్తోంది. ఓటమి విషయంలో నాయకులు ఒక రకంగా ఉన్నారు. కార్యకర్తలు మరో రకంగా ఉన్నారు. ఈ పరిస్థితి చల్లారేందుకు నిజానిజాలు వెలుగు చూసేందు కు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూస్తే..జగన్ విషయంలో కొంత సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో అధినేత ఓదార్పు యాత్రల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తేనే బెటర్ అని సీనియర్లు కూడా సూచిస్తున్నారు.