ఇద్దరి ఫోన్ నంబర్లు నేనే ఇచ్చా.. విచారణలో ఒప్పుకున్న గులాబీ మాజీ ఎమ్మెల్యే?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోను సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2024-11-17 04:08 GMT

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోను సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం జబ్లీహిల్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గంటన్నర పాటు విచారణను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోదరుడి కొడుకు రాజిరెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన గుండూరు ప్రాంతానికి చెందిన ఎస్. వెంకటేశ్వనర్ రావు నంబరును తాను అదనపు ఎస్పీ తిరపతన్నకు ఇచ్చినట్లుగా వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన తిరుపతన్నకు ఫోన్ నెంబర్లు ఎందుకు పంపారు? అన్న ప్రశ్నకు.. తమ సామాజిక వర్గానికి చెందిన వాడని.. ఒక కుటుంబ సమస్య పరిష్కారానికి సంబంధించి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇదంతా కూడా ఆయా నంబర్లు.. తేదీల్ని చూపించి.. విచారణ అధికారి అడగటంతో ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న మీరు చట్టాల్ని ఇలా ధిక్కరించటం ఏంటి? తిరుపతన్నకు ఫోన్ నెంబరు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించగా మరింత ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తనకు నిఘా వ్యవస్థ ఉంటుందని తెలీదని.. అందుకే ఫోన్ నెంబరు అడగటంతో తాను ఇచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల వేళలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ ను ఇవ్వాలన్న విచారణ అధికారి ఆదేశానికి సానుకూలంగా స్పందించిన జైపాల్ యాదవ్ తాను తెచ్చి ఇస్తానని చెప్పినట్లుగా సమాచారం. విచారణ తర్వాత బయటకు వచ్చిన జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇచ్చిన ఫోన్ నంబర్లు రాజకీయ నాయకులవి కావంటూ.. బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పారదర్శకంగా వ్యవహరించినట్లు చెప్పిన ఆయన.. విచారణ కోసం తనను ఎప్పుడు పిలిచినా హాజరవుతానని వెల్లడించారు.

Tags:    

Similar News