నేను మీ ఇంటి పేరు మారిస్తే.. అది నాదవుతుందా?

గల్వాన్‌ లోయలో భారత సైనికుల చేతిలో చావుదెబ్బతిన్నప్పటికీ చైనా బుద్ధి మారడం లేదు.

Update: 2024-04-02 07:49 GMT

గల్వాన్‌ లోయలో భారత సైనికుల చేతిలో చావుదెబ్బతిన్నప్పటికీ చైనా బుద్ధి మారడం లేదు. భారత్‌ సరిహద్దుల్లో డ్రాగన్‌ దేశం మనల్ని కవ్విస్తూనే ఉంది. ఓవైపు భారత్‌ చుట్టుపక్కల దేశాలైన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్‌ లకు భారీ ఎత్తున రుణాలు అందజేస్తూ భారత్‌ వ్యతిరేకతను ఆ దేశాల్లో చైనా నూరిపోస్తోంది. మరోవైపు భారత్‌ – చైనా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఏకంగా గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది. వీటిలోకి పెద్ద ఎత్తున ప్రజలను నివాసం ఉండటానికి తరలిస్తోంది.

భారత్‌ ఎప్పటికప్పుడు చైనా దుశ్చర్యలను ఖండిస్తూనే ఉన్నా దాని బుద్ధి మారడం లేదు. భారత్‌ లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ ను తమ భూభాగంగా చైనా చెప్పుకుంటోంది. అంతేకాకుండా పలుమార్లు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ దేశంలోని భూభాగమేనంటూ మ్యాప్‌ లను కూడా విడుదల చేసి డ్రాగన్‌ తన కుటిల బుద్ధిని చాటుకుంది.

ఈ కుటిల బుద్ధులు చాలవన్నట్టు చైనా మరింత బరితెగించింది. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలకు, సరస్సులకు, పర్వత ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చైనా వ్యవహారంపై భారత్‌ ఘాటుగా ప్రతిస్పందించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌.. ఎప్పటికీ భారత్‌ లోనే భూభాగమని తేల్చిచెప్పింది. కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన, మ్యాప్‌ ల్లో చేర్చినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవని కుండబద్దలు కొట్టింది.

తాజాగా చైనా వ్యవహారంపై భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ సైతం నిప్పులు చెరిగారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవాలు మారవని కర్రుకాల్చి వాతపెట్టారు.

‘నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే ఆ ఇల్లు నాదవుతుందా’ అని జైశంకర్‌ చైనాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పుడూ భారత్‌ లోని భూభాగమేనని తేల్చిచెప్పారు. పేర్లు మార్చినంత మాత్రాన ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయినా ఎదుర్కోవడానికి సరిహద్దుల్లో భారత్‌ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.

కాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ వ్యవహారంలో అమెరికా ఇటీవల భారత్‌ కు మద్దతుగా నిలిచింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ను భారత్‌ లోని భూభాగంగా తాము గుర్తిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News