ముందస్తు లేదా జమిలి : ఈసీకి తెలిసిపోయిందా...?

దీంతో పాటు ఎన్నికల వేడి రాజుకోవడంతో రిటర్నింగ్ అధికారులకు చేతినిండా పని ఈ ఫిర్యాదులతోనే అని అంటున్నారు

Update: 2023-08-04 03:42 GMT

ఏపీలోనే కాదు దేశంలోనే ముందస్తుకు తెర లేస్తోందా. లేక జమిలి ఎన్నికలకు తెర వెనక చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయా. ఇది అతి పెద్ద సందేహం. రాజకీయ వర్గాలలో జరుగుతున్న తీవ్రమైన చర్చ. ఎందుకంటే ఏపీలోనే చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా తొమ్మిది నెలల ముందుగా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నియమించేశారు.

అంటే ఏఆర్వోలు, ఏఈఆర్వోలు మొత్తం 350 దాకా ఉంటారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వీరంతా ఎన్నికల బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఇక మీదట ఎన్నికల పనులు అన్నీ వీరు ముందుకు వచ్చి చేపడతారు. ముందుగా ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులు, సవరణలు, ఫిర్యాదులు ఇలా వీటి మీదనే ఈసీ దృష్టి పెట్టింది.

దీంతో పాటు ఎన్నికల వేడి రాజుకోవడంతో రిటర్నింగ్ అధికారులకు చేతినిండా పని ఈ ఫిర్యాదులతోనే అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇంత తొందరగా రిటర్నింగ్ అధికారులను ఎందుకు నియమించారు అన్నదే చర్చకు వస్తోంది. దీని మీద తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఏపీలో అసాధారణ పరిస్థితులు ఉన్నందువల్లనే తొమ్మిది నెలలు ముందుగా ఆర్వోలను ఈసీ నియమించింది అని విశ్లేషించారు.

అయితే ఆయన అన్నది ఒక విమర్శగా ఉన్న అసలు విషయం లోతుగా ఆలోచిస్తే ఎందుకైనా మంచిదని ఈసీ ముందస్తు సన్నాహాలలో మునిగితేలుతోంది అని అంటున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వరసబెట్టి కీలక బిల్లులను వర్షాకాల సమావేశాలలోనే సభ ముందుకు తేవడం కేంద్రమే ముందస్తుకు పచ్చ జెండా ఊపుతోందా అన్నదే చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే జమిలి ఎన్నికలు అంటూ ఢిల్లీలో ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలో ఇరవై ఎమినిది రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అన్నీ కాదు కానీ కలసి వచ్చిన రాష్ట్రాలు ఒక డజన్ కి పైగా జత కట్టించి జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధంగా ఉందని అంటున్నారు. జమిలి ఎన్నికలకు ఏపీ సర్కార్ కూడా ఓకే అంటుందని అంటున్నారు. అలాగే కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే దానితో పాటే అని ఏపీ చెబుతోందని తెలుస్తోంది.

అంటే మామూలుగా చూస్తే ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ మేలో కానీ జరగవు. అది షెడ్యూల్ ప్రకారం చూస్తే అలాగే ఉంటుంది. కానీ జమిలి అయినా ముందస్తు అయినా అనుకుంటే మాత్రం 2024 ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగవచ్చు అని ఒక ప్రచారంలో ఉంది. ఇక పది లోపు రాష్ట్రాలతోనే ఎన్నికలు అని కేంద్రం అనుకుంటే ఈ ఏడాది డిసెంబర్ లోనే జమిలి ఎన్నికల నగరా మోగించవచ్చు అని అంటున్నారు.

దీనికి తోడు ఏపీ ప్రభుత్వం కూడా తొందరపడుతున్నట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. వరసబెట్టి ఉద్యోగ నియామకాలు చేపట్టడం వివిధ వర్గాల వారిని దగ్గరకు తీయడం, ఎన్నికలకు సంబంధించి జాబితాలను తయారు చేసుకోవడం, అభయ్ర్ధుల ఎంపిక కసరత్తుని ముమ్మరం చేయడం వంటివి చూస్తూంటే ఏదో జరుగుతోంది అని అంటున్నారు.

అయితే ఎప్పటిమాదిరిగానే అధికార వైసీపీ ముందస్తును కానీ జమిలిని కానీ కొట్టేస్తోంది. కానీ విపక్షాలు మాత్రం అదే నిజం అని భావించి దూకుడుగా ముందుకు వస్తున్నాయి. ఇపుడు ఈసీ కూడా దూకుడు పెంచుతూంటే అంతా తెలిసిపోయిందా అన్న డౌట్ అయితే వస్తోంది మరి.

Tags:    

Similar News