జమిలి ఎన్నికలు ఉత్తిత్తిదే.. ప్రజలను కన్ ఫ్యూజ్ చేయడానికేనా...?

దేశంలో ఇపుడు జమిలి ఎన్నికలకు తెర లేచింది. నిజానికి జమిలి ఎన్నికలు అన్న మాట ఈ రోజునే పుట్టుకుని రాలేదు.

Update: 2023-09-02 08:32 GMT

దేశంలో ఇపుడు జమిలి ఎన్నికలకు తెర లేచింది. నిజానికి జమిలి ఎన్నికలు అన్న మాట ఈ రోజునే పుట్టుకుని రాలేదు. చాలా కాలంగా జమిలి ఎన్నికల మీద ప్రచారం అలా సాగుతూ వస్తోంది. జమిలి ఎన్నికలు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెబుతూ వస్తోంది.

ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల దేశంలో నిధులు విధులు అన్నీ ఆదా అవుతాయని, ప్రజలకు కూడా తరచూ ఎన్నికల కోడ్ వల్ల ఇబ్బందులు ఉండవని వల్లె వేస్తున్నారు. మరి ఇంతలా చెబుతున్న బీజేపీ పాలకులు దాదాపుగా పదేళ్ళ పాలనకు దగ్గరకు వస్తున్న ఈ రోజుకూ జమిలి ఎన్నికల ప్రచారమే తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

అంటే జమిలి ఎన్నికలు అంటూ ప్రచారం చేసుకోవడానికేనా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఇక ఇపుడు చూస్తే మరోసారి జమిలి ఎన్నికల జపాన్ని బీజేపీ పెద్దలు వల్లించడానికి రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నరు. ఒక వైపు ఆనాటి పాత యూపీయే తన పేరు మార్చుకుని ఇండియా రూపంలో ముందుకు వస్తోంది. అందులో దిగ్గజ విపక్ష పార్టీలు అన్నీ చేరాయి. దేశంలో దాదాపుగా పది రాష్ట్రాలలో ఇండియా కూటమి అధికారంలో ఉంది.

నానాటికి ఈ కూటమి బలోపేతం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. దీంతో బీజేపీ వేసిన కొత్త ఎత్తుగడ జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల పాటు ముంబైలో జరిగిన ఇండియా కూటమి అనేక కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ఒకే అభ్యర్ధిని బీజేపీ మీద పోటీకి పెట్టాలని నిర్ణయించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చెబుతోంది. ఆ దిశగా అడుగులు పడుతున్న వేళ ఇండియా కూటమి గురించి జాతీయ స్థాయిలో చర్చ లేకుండా చేసేందుకు అన్నట్లుగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెలివిగానే బీజేపీ తెచ్చింది అని అంటున్నారు.

దీని వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ బాగా నానుతుందని, జాతీన మీడియా డిబేట్ లో సైతం జమిలి ఎన్నికల మీద చర్చ రావడం వల్ల బీజేపీ గురించే అంతటా మాట్లాడుకుంటారని వేసిన ఎత్తుగడ అని అంటున్నారు. నిజానికి దేశానికి సార్వత్రిక ఎన్నికలు తొమ్మిది నెలల వ్యవధిలో ఉన్నాయి.

జమిలి ఎన్నికలు అంటే చాలా తతంగం ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించాలి. లోక్ సభ రాజ్యసభలలో మూడొంతులు అంటే 67 శాతం పైగా సభ్యులు జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలపాలి.అదే విధంగా దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు అంటే 14కి పైగా జమిలి ఎన్నికలకు చట్ట సభలలో తీర్మానం చేసి ఆమోదం తెలపాలి.

ఇక రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అధికరణాన్ని సవరించాలని అంటున్నారు. అలాగే జమిలి ఎన్నికలు అంటే అనేక రాష్ట్రాలలో అధికారాన్ని విపక్షాలు ముందుగానే వదులుకోవాలి. ఇవన్నీ అయ్యే పనులు అయితే కావు. ఇక జమిలి ఎన్నికలు అని కట్టకట్టుకుని ఒకేసారి పెట్టేసినా మధ్యలో ప్రభుత్వాలు కూలితే ఏమి చేస్తారు అన్న దానికి జవాబు లేదు, అదే విధంగా ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఏమి చేస్తారు అన్న దానికి సమాధానం కనుగొనాలి.

నిజంగా జమిలి ఎన్నికలు అన్న పదం అందంగా కనిపిస్తున్నా అది ఆచరణలో మాత్రం అసాధ్యం అని అంటున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళలో అన్ని రాష్ట్రాలు కేంద్రంతో పాటు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అలా మూడు దఫాలు సాగాయి. ఆ మీదట కేంద్రం దారి కేంద్రానిది రాష్ట్రాల దారి వారిది అయింది. దీనికి కారణం రాజకీయ చైతన్యం వెల్లి విరియడం, ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం ఇత్యాదివి అన్నీ ఉన్నాయి.

ఇపుడు అంతకంటే కూడా విపక్షాలు దేశంలో బలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో జమిలి ఎన్నికలు అంటే ఎవరు ఒప్పుకుంటారు అన్నది పెద్ద ప్రశ్న. ఎన్నికలు అంటే కేవలం డబ్బు ఖర్చు అని మాత్రమే అనుకోరాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కంటే విలువ అయినది మరొకటి లేదు. అందువల్ల జమిలి ఎన్నికల ప్రతిపాదన భారత్ వంటి దేశాలలో సుసాధ్యం అవుతుందా అన్నది చూడాలి. అయితే బీజేపీ మాత్రం సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందే ఈ ప్రతిపాదనలు తీసుకురావడం పట్లనే అందరికీ సందేహాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News