ఆర్జీవీ కామెంట్స్: "చంద్రబాబు, జగన్, రేవంత్ జైలు వెళ్లారు.. నేనెంత?"
అందుకు ఏపీ పోలీసులు అనుమతించలేదు. నాటి నుంచీ వర్మ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఆర్జీవీపై ఏపీ పోలీసులు పెట్టిన కేసు, విచారణకు హాజరుకాకుండా ఆయన చెబుతున్న విషయాలు, చేస్తోన్న కామెంట్లు, విడుదల చేస్తోన్న వీడియోలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జీవీకి సంబంధించిన ఓ వీడియో ఆసక్తిగా మారింది.
అవును... ఏపీ పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇస్తే టైం అడుగుతూ వాట్సప్ మెసేజ్ పెట్టిన ఆర్జీవీ.. రెండోసారి నవంబర్ 25న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసు విషయంలో ఆన్ లైన్ విచారణను అడిగారు. అందుకు ఏపీ పోలీసులు అనుమతించలేదు. నాటి నుంచీ వర్మ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని అంటున్నారు.
మరోపక్క ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు.. అటు తమిళనాడు, ఇటు తెలంగాణ పోలీసుల సహాయం తీసుకుని.. సుమారు ఆరు బృందాలుగా ఏర్పడి మరీ గాలిస్తున్నారని చెబుతున్నారు! ఈ స్థాయిలో ఈ విషయం ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ... తాను రోజుకి 10 నుంచి 15 పోస్టులు పెడతానని.. అవి కొన్ని తాను చేసినవి కాగా, మరికొన్ని ఎవరో చేసి పంపినవి కావొచ్చు అని తెలిపారు. ఏడాది క్రితం తాను పెట్టినట్లు చెబుతున్న ఆ పోస్ట్ ఏమిటో కూడా తనకు గుర్తు లేదని అన్నారు. ఏడాది క్రితం పెట్టిన పోస్టుపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో అని అన్నారు!
ఈ సమయంలో తాను పారిపోయానని.. తన ఇంటిని చుట్టుముట్టిన పోలీసు దళాలు అని రకరకాల వార్తలు వస్తున్నాయని.. ముంబై కి ఒకటీమ్, కోయంబత్తూరుకి ఒక టీమ్, చెన్నై కి ఒక టీమ్ వెళ్లిందని.. ఇలా ఆరు టీమ్ లు తన కోసం తిరుగుతున్నాయని అంటున్నారని.. అయితే ఇప్పటి వరకూ వాళ్లెవరూ "ఆర్జీవీ డెన్"లోకి రాలేదని అన్నారు.
అసలు పోలీసులు తన కోసం వచ్చేది అరెస్ట్ చేయడానికా కాదా అనే విషయం కూడా తనకు తెలియదని.. వాళ్లు కూడా తాము అరెస్ట్ చేయడానికి వచ్చామని, వర్మ పారిపోయాడని కానీ పోలీసులు చెప్పడం లేదని.. మొత్తమంతా మీడియానే దీనిగురించి చెబుతోందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రతీ సబ్జెక్ట్ మీదా అభిప్రాయాల తుఫాను పడుతుందని.. అందులో తానూ ఒకడిని అని అన్నారు. కానీ.. అసలు పోలీసు వ్యవస్థ ఉన్నదే ఇలాంటి వాటి కోసం, ఆర్జీవీని పట్టుకోవడం కోసం అన్నట్లుగా కలర్ ఇవ్వడం వెనుక ఎవరికైనా, ఏమైనా ఉద్దేశ్యం ఉందో కూడా తంకు తెలియదని.. అయితే ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని అనుకుంటున్నట్లు తెలిపారు.
తాను అలా భావించడానికి కారణం.. ఆ పోస్ట్ పెట్టిన సంవత్సరం తర్వాత నలుగురు వ్యక్తులు, నాలుగు ప్రాంతాల్లో ఒకేసారి అదే విషయం పోస్టులు పెట్టడమని తెలిపారు. అందువల్లే తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు తెలిపారు! తన టైం వేస్ట్ చేయడానికో, తనను హెరాస్ చేయడానికో ఇలాంటివి చేస్తున్నారనే విషయం తెలిసిపోతోందని పేర్కొన్నారు!
ఉదయం లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో జరిగేదే ఇదని.. ప్రస్తుతం 9 మంది కేసులు పెట్టారు, అది 90 కావొచ్చు, 900 కావొచ్చు, 9000 కావొచ్చు.. దీనికి ముగింపు ఎక్కడుందని అన్నారు! తన కుమారుడిని వేదిస్తున్నారని, తన మనోభావాలు దెబ్బతిన్నాయని మా అమ్మ కూడా కేసు పెట్టొచ్చని ఆర్జీవీ వెల్లడించారు!
ఈ రకంగా చూసుకుంటే ఏపీలో ఉన్న ఐదు కోట్ల మంది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవాలని.. మనోభావాలు దెబ్బతినడానికి అంతే లేదని చెప్పుకొచ్చారు! దీని నుంచి తప్పించుకోవడానికి తాను దుబాయ్, ఎక్కడికో పారిపోవడం కంటే అరెస్టైపోవడాన్నే తాను ప్రిఫర్ చేస్తానని.. తనకు జైల్లో అయితే బోలెడు కథలైనా దొరుకుతాయని వర్మ తెలిపారు.
ఈ సందర్భంగా... చంద్రబాబు, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డే జైలుకు వెళ్లినప్పుడు తానెంత అని ప్రశ్నిస్తున్నారు ఆర్జీవీ. మీరు ఏ కేసులో జైలుకు వెళ్లారన్నాది పాయింట్ కానీ.. జైలుకు వెళ్లడం పాయింట్ కాదని వర్మ స్పష్టం చేశారు. ఇలాంటి కేసులో కూడా తాను జైలుకు వెళ్లాల్సి వస్తే.. పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ అర్ధమవుతుందని వర్మ అభిప్రాయపడ్డారు.