బీఆర్ఎస్ టు టీఆర్ఎస్.. పార్టీ పేరు మారబోతోందా..?

తెలంగాణ ప్రజల భావోద్వేగాలు.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్.. తెలంగాణ ప్రజల ఆత్మలతో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.

Update: 2024-11-28 06:25 GMT

తెలంగాణ ప్రజల భావోద్వేగాలు.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్.. తెలంగాణ ప్రజల ఆత్మలతో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పార్టీ పురుడు పోసుకోగా.. మొదటి నుంచి సెంటిమెంటును రాజేస్తూ.. ఉద్యమమే ఊపిరిగా సత్తా చాటింది. రెండు దశాబ్దాలకు పైగా పార్టీకి ఎదురులేకుండాపోయింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే ఎగిరాయి. ఏ ఎన్నిక చూసినా గులాబీ లీడర్లే గెలుపొందారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామాలు చేసినా అదే టీఆర్ఎస్ తరఫున ఎన్నిసార్లు పోటీచేసినా ప్రజలు గెలిపించారు. టీఆర్ఎస్ పార్టీ పార్టీ కాదు.. అది ఉద్యమ పార్టీ.. మా పార్టీ అన్నట్లుగా ప్రజలు ఓన్ చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా పార్టీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ తలకిందులయ్యాయి. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిపోవడంతో ప్రజల్లోనూ ఆ పార్టీపై సెంటిమెంట్ పోయింది. ఫలితంగా రెండు టర్మ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి గెలిచిన టీఆర్ఎస్ పార్టీ.. హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. పార్టీ పేరు మార్చడంతో పూర్తిగా అస్తిత్వాన్నే కోల్పోయినంత పనైంది. పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజల పేగుబంధం తెగిపోయినట్లుగా ప్రజలు ఫీలయ్యారు.

జాతీయ రాజకీయాల్లో సత్తాచాటాలని కేసీఆర్ టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌గా మార్చారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అంతటా గులాబీ జెండా ఎగురుతుందని, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని కలలు కన్నారు. దాంతో కొన్ని రాష్ట్రాల్లో అడపాదడపా జాయినింగ్స్ కూడా జరిగాయి. ఇక పార్టీకి ఢోకా లేదని భావించారు. కానీ.. సొంత రాష్ట్రంలో పార్టీ రోజురోజుకూ మసకబారుతున్నదన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. బీఆర్ఎస్ అనే పేరు ఆ పార్టీకి ఏ మాత్రం కలిసిరాకుండాపోయింది. వరుసబెట్టి ఓటములను చవిచూడాల్సి వచ్చింది.

పార్టీ పేరు మార్చడం వల్లే తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల సెంటిమెంటును కోల్పోయామని చాలా మంది నేతలు అధినేత వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతర్గత సమావేశాల్లోనూ వారు అదే అభిప్రాయం వెలిబుచ్చారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరువాత దీనిపై మరింత సీరియస్‌గా చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మారిస్తేనే ప్రజలు చేరదీసే అవకాశాలు ఉంటాయని తమ అభిప్రాయాన్ని చెప్పారు. దాంతో ఇప్పుడు పార్టీ పేరు మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ వాదమే పార్టీకి బలమని భావించి బ్యాక్ టు టీఆర్ఎస్ అని నామకరణం చేసేందుకు సిద్ధం అయినట్లుగా సమాచారం.

మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్నే నమ్ముకునే పార్టీని కొనసాగించింది. బీఆర్ఎస్ గా నామకరణం చేయడంతో ఆ సెంటిమెంటును కోల్పోయామని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ ఉంది. పార్టీ కార్యకర్తల సమావేశాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని టాక్. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అన్నట్లుగా మాట్లాడారు. దాంతో బీఆర్ఎస్‌ను మళ్లీ ప్రాంతీయ పార్టీగానే కొనసాగించే అవకాశాలు లేకపోలేదని ఆయన స్టేట్మెంట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు.. కేసీఆర్ కూతురు నేతృత్వంలో కొనసాగుతున్న జాగృతిని ఇప్పటికే భారత జాగృతి నుంచి తొలగించి తెలంగాణ జాగృతిగా మార్చేశారు. తెలంగాణ జాగృతి పేరిటనే ఇటీవల కులగణన కమిటీకి ఆమె వినతిపత్రం అందించారు. గతంలో భారత జాగృతి పేరిట జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఆందోళనలు కూడా చేశారు. కానీ.. రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం, ఆమె సైతం జైలుకు వెళ్లి రావడంతో తెలంగాణ సెంటిమెంటుతోనే ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. అందుకే.. తెలంగాణ జాగృతి పేరిటనే కార్యకలాపాలను ప్రారంభించారు.

అయితే.. ఎంతో హడావిడిగా పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన అధినేత కేసీఆర్.. ఇప్పుడు పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చేందుకు టెక్నికల్‌గా అన్ని కలిసివస్తాయా అన్న ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం. గతంలోనే గులాబీ బాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. పార్టీ పేరు మార్చాలని భావిస్తే టెక్నికల్‌గా అది సాధ్యం కాదన్న విషయం వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మారకుంటే.. తెలంగాణ సెంటిమెంటునే అస్త్రంగా మలుచుకొని మరో ఉద్యమం లాగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News