ట్రంప్ 'గోల్డ్ కార్డ్' వీసాను తిరస్కరించిన బిలియనీర్లు.. కారణమిదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన $5 మిలియన్ ‘గోల్డ్ కార్డ్’ వీసా పథకానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు.;

Update: 2025-03-04 06:00 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన $5 మిలియన్ ‘గోల్డ్ కార్డ్’ వీసా పథకానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో ఈ పథకం విఫలమైందని అర్థమవుతోంది.. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ వ్యాపారవేత్తలు ఈ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫోర్బ్స్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, 18 మంది బిలియనీర్‌లలో దాదాపు మూడొంతులు ఈ పథకంలో పాల్గొనడం గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు.

- గోల్డ్ కార్డ్ వీసా లక్ష్యం ఏమిటి?

ట్రంప్ ప్రభుత్వ పరిపాలనలో ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక వీసా పథకం ద్వారా విదేశీ బిలియనీర్‌లు అమెరికాలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం, వ్యాపారాలను ప్రారంభించడం, దేశీయ పెట్టుబడులు పెంచడం అనే లక్ష్యంతో ముందుకు తీసుకువచ్చారు. కానీ ఈ పథకం బిలియనీర్ల నుంచి ఆశించిన విధంగా స్పందనను పొందలేకపోయింది.

- బిలియనీర్లు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ పథకంపై బిలియనీర్‌ల ఆసక్తి తక్కువగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫోర్బ్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 18 మంది బిలియనీర్‌లలో దాదాపు మూడొంతులు ఈ పథకంలో ఆసక్తి లేదని తెలిపారు. "ధనికులు ఈ వీసాను ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది అర్థం కావడం లేదు" అని ఒక రష్యన్ బిలియనీర్ అన్నారు. మరొకరు "ఇప్పుడు వ్యాపార ఆలోచనలను చాలా తక్కువ ఖర్చుతో అమలు చేయాలని చూస్తున్నాం. దీని కోసం $5 మిలియన్ ఖర్చు చేయాలనే అవసరం వస్తుంది?" అని వ్యాఖ్యానించారు. భారతదేశంలోని రెండో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ చైర్మన్ అయిన అభయ్ సోయి ఈ పథకాన్ని పూర్తిగా తిరస్కరించారు. "ఈ శతాబ్దంలో భారతదేశం తప్ప మరే దేశపు పౌరుడిగా నేను ఉండదలచుకోను అని ఆయన స్పష్టం చేశారు.

-వీసా తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఇవీ

అమెరికా వలస విధానాల అనిశ్చితి : ట్రంప్ పాలనలో వలస విధానాలు తరచుగా మారిపోతుంటాయి. దీనివల్ల పెట్టుబడిదారులు అమెరికాలో స్థిరపడటంపై సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వీరికి ఇప్పటికే ప్రీమియం వీసా మార్గాలు అందుబాటులో ఉండటం : చాలా మంది బిలియనీర్‌లు ఇప్పటికే ఇతర ప్రత్యేక వీసా పథకాల ద్వారా అమెరికాలో బస చేసేందుకు వీలుగా మార్గాలను ఏర్పరుచుకున్నారు.

పన్నుల భారం : అమెరికాలో పెట్టుబడులు పెడితే అధిక పన్నులు విధించే అవకాశం ఉండటంతో కొందరు దీని వైపు ఆసక్తిని కోల్పోయారు.

వేరే దేశాల్లో మెరుగైన అవకాశాలు : కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు సులభమైన పెట్టుబడి వీసా విధానాలను అమలు చేయడంతో బిలియనీర్‌లు వాటిని ఎంపిక చేసుకుంటున్నారు.

- గోల్డ్ కార్డ్ వీసా పథకం భవిష్యత్తు?

ఈ పథకం ప్రస్తుత పరిస్థితుల్లో విజయవంతం కావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అమెరికా వీసా విధానాలు మరింత సౌలభ్యంగా మారితే.. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధంగా ప్రణాళికలు రూపొందిస్తే మాత్రమే ఇది విజయవంతం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, కొత్తగా రాబోయే అధ్యక్షుల పరిపాలన ఏ విధంగా వీసా విధానాలను మార్చుతుందో కూడా కీలకంగా మారనుంది.

ఈ నేపథ్యంలో అమెరికా పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన అవకాశాలను సృష్టించగలిగితే మాత్రమే బిలియనీర్‌లు ‘గోల్డ్ కార్డ్’ వీసాకు ఆసక్తి కనబరచే అవకాశముంది.

Tags:    

Similar News