సర్పంచ్‌ హత్య కేసులో ఆరోపణలు...మంత్రి రాజీనామా!

ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకుండానే మహారాష్ట్రలోని మహా యుతి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి.;

Update: 2025-03-04 06:02 GMT

ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకుండానే మహారాష్ట్రలోని మహా యుతి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే భాగస్వామ్య పార్టీ శివసేన (శిందే) అధినేత, మాజీ సీఎం, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిందే తన నిరసన గళం వినిస్తున్నారు.

మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (అజిత్ పవార్)కి చెందిన యువ నాయకుడు, మంత్రిగా ఉన్న ధనుంజయ్ ముండే ప్రధాన అనుచరుడు ఓ సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండడం కలకలం రేపుతోంది.

49 ఏళ్ల ధనుంజయ్ ముండే ఎవరో కాదు.. బీజేపీలో పెద్ద నాయకుడిగా పేరు తెచ్చుకుని.. ఒకవేళ జీవించి ఉంటే ఇప్పుడు సీఎం అయ్యే దివంగత గోపీనాథ్ ముండేకు సోదరుడి కుమారుడు. అయితే, ధనుంజయ్ 2013లోనే ఎన్సీపీలో చేరారు. గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ బీజేపీ తరఫున మంత్రిగా కేబినెట్ లో ఉండడం గమనార్హం.

బీడ్ జిల్లాలోని పరిల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ధనుంజయ్.. తాజాగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధనంజయ్‌ ముండే మంత్రిగా వైదొలగారు. సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశాలతో రాజీనామా సమర్పించారు.

ధనుంజయ్ ముండే ప్రధాన అనుచరుడైన వాల్మీకి కరాద్ మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

సర్పంచ్ హత్య జరిగింది డిసెంబరులో. అంటే మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే అన్నమాట. అప్పటినుంచే పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రిగా ఉన్న ధనుంజయ్ ముండేను ఆరోపణలు చుట్టుముట్టాయి.

మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే మహాయుతిలో పొత్తుల పంచాయితీ నడుస్తోంది. ఇలాంటి సమయంలో మంత్రిపై సర్పంచ్ హత్య ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అందుకనే సీఎం ఫడణవీస్ మంత్రి ధనుజంయ్ ముండే రాజీనామా కోరారు. ఆయన రాజీనామా సమర్పించగా గవర్నర్ రాథాక్రిష్ణణ్ ఆమోదించారు.

ఎన్సీపీ (అజిత్ పవార్) అధినేత అజిత్ పవార్ ను సంప్రదించిన మీదటనే ధనుంజయ్ ముండే రాజీనామాను సీఎం కోరినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News