సత్తా చూపిన ఆలపాటి.. వావ్ అనే మెజార్టీతో అదిరే గెలుపు
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పట్టభద్రులు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పట్టభద్రులు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మిగిలిన వాటి కంటే సీనియర్ టీడీపీ నేత తెనాలికి చెందిన ఆలపాటి రాజా విజయం ఇప్పుడు అదుర్సు అనేలా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం పట్టభద్రుల ఎన్నికల్లో ఆయన సాధించిన మెజార్టీనే. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా తన ప్రత్యర్థిపై 82,319 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు.
మొత్తం 2,41,544 ఓట్లు పోల్ కాగా.. అందులో 26,676 ఓట్లు చెల్లలేదు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో.. ఆలపాటి రాజా భారీ (82,319 ఓట్లు) మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. దీంతో కూటమి నేతలు.. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంది. కానీ.. ఈ సీటును నాదెండ్ల మనోహర్ కు జనసేన కేటాయించటం.. ఈ విషయంలో పవన్ కచ్ఛితమని తేల్చి చెప్పటంతో.. ఆలపాటి రాజాకు అవకాశం దక్కలేదు.
ఈ సందర్భంగా ఆయన తీవ్ర అసంత్రప్తికి గురయ్యారు. కారణం.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే విజయం ఖాయంతో పాటు.. మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించారు. అయితే.. టికెట్ కే అవకాశం లేకపోవటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను పిలిపించుకొని మాట్లాడటమేకాదు.. ఆయన సంగతి తాను చూసుకుంటానని మాట ఇవ్వటం జరిగింది.
తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ విజయం కోసం నిజాయితీగా పని చేసిన ఆలపాటి రాజా పార్టీ పట్ల తనకున్న కమిట్ మెంట్ ఏమిటో చేతల్లో చూపించేశారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వటం.. తన సత్తా చాటటం ద్వారా తానేమిటో ఫ్రూవ్ చేసుకున్నారని చెప్పాలి. మరి.. మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న ఆయన విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.