పేర్ని నానిని జనసైనికులు వదలరా ?

వైసీపీ అధికారంలో ఉన్నపుడు మంత్రి ఆయన. పార్టీ లైన్ ప్రకారం మాట్లాడారో ఇంకా ఓవర్ డోస్ లో మాట్లాడారో అదంతా రాజకీయం.

Update: 2024-09-02 04:03 GMT

వైసీపీ అధికారంలో ఉన్నపుడు మంత్రి ఆయన. పార్టీ లైన్ ప్రకారం మాట్లాడారో ఇంకా ఓవర్ డోస్ లో మాట్లాడారో అదంతా రాజకీయం. ఆయన మాట తీరులో వెటకారం కారాలను ఒంటికి రాస్తుంది. పవన్ ని పట్టుకుని ఎక్కువగా విమర్శించింది మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని అని అంటే అంతా ఒప్పుకుంటారు.

పవన్ ని అంతలా విమర్శించడం ఆయనకు నచ్చలేదు, ఫ్యాన్స్ కం జనసైనికులకు అంతకంటే నచ్చలేదు. అయితే పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నపుడు బాగానే నోరు చేసుకున్నారు. ఇపుడు కాస్తా సైలెంట్ అయ్యారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఒక విధానంగానే ఉంటున్నారు.

అయితే ఓటమి తరువాతనే కదా నేతలు దొరికేది అన్న పాయింట్ తో ఇపుడు జనసైనికులు పేర్ని నానిని ఎటాక్ చేస్తున్నాయి. అపుడెపుడో రెండేళ్ళ క్రితం పవన్ పార్టీ సభలో ఒక చెప్పు చూపించి వైసీపీ నేతలను హెచ్చరించారు. దానికి మా దగ్గరా చెప్పులు ఉన్నాయని నాని రెండు చెప్పులు తీసి చూపించారు మీడియా సమావేశంలో.

ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్. లేటెస్ట్ గా జరిగింది ఏంటి అంటే గుడివాడలోని తన స్నేహితుడు సహచర నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. అయితే ఆ విషయం క్షణాలలో వైరల్ అయింది. జనసేన నేతలు అంతా అక్కడికి వచ్చి పేర్ని నానికి వ్యతిరేకంగా శివాజీ ఇంటి ముందే ఆందోళన చేశారు.

అంతే కాదు పవన్ మీద అప్పట్లో చేసిన కామెంట్స్ కి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ కూడా చేశారు. అంతే కాదు పేర్ని నాని మీద కొందరు యువకులు కోడిగుడ్లు విసిరారు. అసలు ఇవన్నీ ఏ మాత్రం ఊహించని పేర్ని నాని షాక్ కి గురి అయ్యారు. ఆయన తన స్నేహితుడిని చూడడానికి వెళ్తే జనసైనికులు ఆందోళన చేయడంతో ఇబ్బంది పడ్డారు కూడా.

అంతే కాదు పేర్ని కారుని కూడా ద్వంసం చేసేందుకు జనసైనికులు ప్రయత్నించడం కూడా కలకలం రేపింది. ఆయన కారు అద్దాలను బద్ధలు కొట్టారు. ఇంతలా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి జనసేన నేతలను అదుపు చేయడంతో పేర్ని నాని అక్కడ నుంచి బయటకు వెళ్లగలిగారు.

గతంలో రెండు చెప్పులతో పవన్ ను పేర్ని నాని అవమానించారని ఇప్పుడు 36 చెప్పులు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని జనసైనికులు అనడం విశేషం. మొత్తానికి చూస్తే పేని నాని అక్కడి నుంచి పోలీసుల అండతో వెళ్ళినా జనసైనికుల వార్నింగులూ వీరంగాలను మాత్రం ఆయన ప్రత్యక్షంగానే చూశారు.

ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. మాజీ మంత్రిగా పేర్ని నాని ఉన్నారు. పోటీ కూడా చేయలేదు. గతంలో అన్న మాటలను పట్టుకుని జనసైనికులు దాడికి యత్నించారు అని వైసీపీ నేతలు గుర్రుమంటున్నారు. అయితే పేర్ని నానిని గట్టిగానే టార్గెట్ చేసిన జనసైనికులు మాత్రం ఆయనను వదిలేలా లేరు అని అంటున్నారు.

ఇవన్నీ పక్క్న పెడితే ఓటమి చెదిన మూడు నెలల తరువాతనే పేర్ని నాని ఇలా ఒంటరిగా దొరికారా లేక ఇదే సమయం అనుకుని ఎంచుకున్నారా అన్న చర్చ వస్తోంది. గుడివాడలో జనసైనికులు మొదలెట్టినది క్రిష్ణా జిల్లా మొత్తం జనసైనికులు పాటిస్తే మాత్రం పేర్ని నాని మచిలీపట్నం నుంచి తాడేపల్లి లోని వైసీపీ ఆఫీసుకు రావడం కూడా కష్టమవుతుందా అన్నది ఒక ప్రశ్న అయితే ఇలా చేయడం కూటమి పెద్దలకు ఇష్టమవుతుందా అన్నది మరో ప్రశ్న. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News