గాజు గ్లాస్ గుర్తు అందరిదీ...కూటమికి దక్కేందేంటి ?

అలా చూస్తే కనుక ఏపీలో దాదాపుగా పాతిక అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాస్ గలగలలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి.

Update: 2024-04-30 03:00 GMT

గాజు గ్లాస్ గుర్తు అనుకున్నట్లుగానే కొంప ముంచింది. అది కామన్ సింబల్ గా జనసేనకు లేదు. ఫ్రీ సింబల్ గానే ఈసీ పెట్టింది. దాంతో నామినేషన్ల ఉపసంహరణ తరువాత గాజు గ్లాస్ గుర్తు కోసమే రెబెల్స్ కానీ ఇండిపెండెంట్లు కానీ పోటీ పడ్డారు. ఇందులో కూడా పలుకుబడి కలిగిన వారే గాజు గ్లాస్ ని చేత్తో ఎత్తుకున్నారు.

అలా చూస్తే కనుక ఏపీలో దాదాపుగా పాతిక అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాస్ గలగలలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి. ఇది టీడీపీ కూటమిని విపరీతంగా కలవరపెడుతోంది. గాజు గ్లాస్ అంటేనే పవన్ కళ్యాణ్ జనసేనది అన్నది అందరికీ తెలుసు. నిన్నటి దాకా సీటు తమకే వస్తుందని ఆశావహులు అంతా గల్లీలలో తిరిగి తెగ ప్రచారం చేశారు. ఇపుడు ఆ గుర్తు ప్రత్యర్ధులకు వెళ్లింది.

ఎంత కాదనుకున్నా మరెంత వీలు లేదని అనుకున్నా గాజు గ్లాస్ గుర్తుకు కనీసంగా ప్రతీ నియోజకవర్గంలో వేయి నుంచి రెండు వేల దాకా ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. అసలే వైసీపీకి టీడీపీ కూటమికి మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. చాలా చోట్ల ఈసారి వందలు పదుల ఓట్లు కూడా విజేతను డిసైడ్ చేస్తాయని చెబుతున్నారు. అలాంటి వాతావరణం ఉన్న నేపధ్యంలో ఈ పాతిక అసెంబ్లీ సీట్లలో గాజు గ్లాస్ కొంప ముంచేస్తుంది అన్న భయాలు అయితే చాలా మందిలో ఉన్నాయి.

నిజానికి గాజు గ్లాస్ గుర్తుని కామన్ సింబల్ గా ఉంచమని తమకే ఇవ్వమని ఈసీని జనసేన కోరినట్లుగా ప్రచారం సాగింది. అయితే రూల్ ఈజ్ రూల్ అన్నట్లుగానే ఈసీ వ్యవహరించింది అంటున్నారు. ఏపీలో జై భారత్ పార్టీ పేరుతో పోటీ చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి బ్యాటరీ టార్చిని ఈసీ ఇచ్చింది. ఆయన పార్టీ జనసేన కంటే ఏపీలో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోంది కనీసంగా ఎనభై సీట్ల దాకా ఆ పార్టీ అభ్యర్ధులను ఏపీలో దించారు.

కానీ మిగిలిన చోట్ల ఆయన పార్టీ గుర్తుని ఫ్రీ సింబల్ గా చేసి ఇతరులకు ఇస్తున్నారు. అదే విధంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ కి గతసారి హెలికాప్టర్ గుర్తు ఇస్తే ఈసారి కుండ గుర్తు ఇచ్చారు. సాధారణంగా ఒకసారి కనుక కామన్ సింబల్ హోదా కోసం సరిపడా ఓట్లు తెచ్చుకోలేరో వారికి ఆ గుర్తు కూడా లేకుండా పోతుంది.

అక్కడికి గాజు గ్లాస్ జనసేన బంధం గట్టిది కావడంతో ఆ పార్టీకి అదే గుర్తు ఇచ్చారు. కానీ మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్ చేసారు ఇది ఈసీ నిబంధన. దాంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఇపుడు గాజు గ్లాస్ గుర్తు మీద ఏపీలో దాదాపుగా యాభై అసెంబ్లీ సీట్ల దాకా అభ్యర్ధులు పోటీలో ఉన్నట్లే అవుతుంది అని అంటున్నారు.

ఒక విధంగా అన్ని సీట్లలో జనసేన పోటీ పడకపోయినా ఆయన సింబల్ మాత్రం పోటీలో ఉంటోంది. పైగా అందులో కూడా ఎక్కువ మంది టీడీపీ రెబెల్స్, జనసేన రెబెల్స్ ఉన్నారు. దాంతో వీరిలో ఎవరు సత్తా చాటినా రేపు గెలిచినా వారు కూటమికే మద్దతు ఇస్తారు అన్న ప్రచారమూ ఉంది. ఏది ఏమైనా గాజు గ్లాస్ గుర్తు మాత్రం ఇపుడు టీడీపీ కూటమిలో కొత్త కలవరమే రేపింది అని అంటున్నారు. దీనికి విరుగుడుగా ఏమి చేసి ఓట్ల చీలికను ఆపుతారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News