వార్నింగ్ ఇచ్చే నాగబాబు తాజా రిక్వెస్టు.. పొత్తు దెబ్బ తినే వ్యాఖ్యలు వద్దట!

ఇంటిపోరు గురించి బయటకు వార్తలు వస్తున్నప్పటకీ.. జనసేనకు సంబంధించిన కీలక నేతలు ఎవరూ ఓపెన్ అయ్యింది లేదు.

Update: 2023-09-24 04:44 GMT

ఇంటిపోరు గురించి బయటకు వార్తలు వస్తున్నప్పటకీ.. జనసేనకు సంబంధించిన కీలక నేతలు ఎవరూ ఓపెన్ అయ్యింది లేదు. ఆ లోటును తీరుస్తూ తాజాగా జనసేన అధినేత సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని చెప్పాలి. ఇంతకాలం లోగుట్టుగా ఉన్న తేడా.. తాజాగా నాగబాబు పుణ్యమా అని బయటకు వచ్చిందని చెప్పాలి. టీడీపీ - జనసేన మధ్య పొత్తు లెక్కను రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్ వెల్లడించటం తెలిసిందే. ఈ పొత్తుపై జనసేనకు చెందిన పలువురు అభిమానులు.. సానుభూతిపరులు వ్యతిరేకంగా ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే.. దీనిపై స్పష్టత లేని పరిస్థితి. అయితే.. ఈ కొరత తీరేలా నాగబాబు తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. రానున్నది జనసేన - టీడీపీ ప్రభుత్వమని చెప్పిన నాగబాబు.. పొత్తుకు తూట్లు పొడిచే ఎవరూ మాట్లాడొద్దని పార్టీకి చెందిన వారిని రిక్విస్టు చేయటం గమనార్హం. తాజాగా తిరుపతి.. శ్రీకాళహస్తి.. చంద్రగిరి.. జీడీ నెల్లూరు.. సత్యవేడు.. మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన నేతలు.. కార్యకర్తలతో ఆయన తిరుపతిలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు.. జనసేన - టీడీపీ పొత్తుకు సంబంధించిన జస్టిఫికేషన్ ను ఇచ్చే ప్రయత్నం చేశారు. క్షేత్ర స్థాయిలో జనసైనికులు.. వీర మహిళలు.. టీడీపీ నేతలు.. కార్యకర్తలతో కలిసి పని చేయాలని చెప్పారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో జగన్ దిట్ట అన్న ఆయన.. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం పలకాల్సిన బాధ్యత జనసైనికుల మీద ఉందన్న ఆయన.. టీడీపీతో పొత్తు దెబ్బ తినేలా వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని పదే పదే ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. మరి.. నాగబాబు మాటలకు పవన్ అభిమానులు.. ఆరాధకులు ఏ మేరకు పాటిస్తారో చూడాలి.

Tags:    

Similar News