జనసేనకు సైలెంట్ దెబ్బ పడుతోందా...!
అయితే.. ఆ వేవ్ అధికార పార్టీ వైసీపీ గురించి కాదు.. ప్రధాన ప్రతిపక్షం జనసేన గురించేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రాజకీయాలు ఎప్పుడు రణగొణ ధ్వనులతోనే ఉండవు. ఎప్పుడూ.. వివాదాలు, విమర్శలతోనూ ఉండవు. కొన్ని కొన్ని సార్లు సైలెంట్ వేవ్ పనిచేస్తుంది. దీనిని గుర్తించి సరిచేసుకుంటే సరే.. లేకపోతే, పెను ప్రమాదాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సైలెంట్ వేవ్ కుమ్మేసింది. పైకి ఎంత డాంబికాలు పలికినా..మేమే గెలుస్తామ ని చెప్పినా.. కేసీఆర్ పార్టీ బీఆర్ ఎస్‌కు.. ఊహించని విధంగా సైలెంట్ వేవ్ తాకింది. ఆయన ఇచ్చిన రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎటు పోయినయ్? అని వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి వచ్చింది.
కట్ చేస్తే.. ఏపీలోనూ ఇలాంటి సైలెంట్ వేవ్‌కు అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి. అయితే.. ఆ వేవ్ అధికార పార్టీ వైసీపీ గురించి కాదు.. ప్రధాన ప్రతిపక్షం జనసేన గురించేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చిత్రంగా ఉన్నా.. ఇది నిజమేనన్నది ఉభయ గోదావరి జిల్లాల నాయకులు చెబుతున్న మాట. దీనికి ప్రధానంగా 2 కారణాలు చూపిస్తున్నారు. ఈ కారణాలే.. జనసేనకు సైలెంట్ దెబ్బ పడేలా చేస్తాయని అంటున్నారు. వీటి నుంచి పవన్ కళ్యాణ్ ముందుగానే కోలుకుంటే.. మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
1) సీట్లు మరింత తగ్గించుకోవడం: కొన్నాళ్ల కిందట సీట్ల పంపకాలు జరిగినప్పుడు జనసేన 24 సీట్లకు పరిమితమైంది. అప్పు డు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఆందోళన చేశారు. కొందరు బహిరంగ విమర్శలు కూడా చేశారు. మరికొందరు పెద్దలు లేఖలు రాసి నిరసన తెలిపారు. అయితే.. పవన్.. తనకు ఎవరూ సలహాలు ఇవ్వద్దని తేల్చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ 24 కూడా 21కి తగ్గింది. అయితే.. చిత్రంగా ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు. నిరసనలు కూడా లేవు. అలాగని పవన్‌ను సమర్ధిస్తున్నారా? అంటే కాదు. ఇదేసైలెంట్ వేవ్. తర్వాత చూస్తాం.. అన్నట్టుగా ఉన్నారు.
2) టీడీపీ నేతలను చేర్చుకోవడం: కొన్న కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పవన్ కళ్యాణ్.. తన కు వచ్చిన సీట్లను కూడా టీడీపీ నేతలకు పంచుతున్నారు. ఉదాహరణకు భీమవరం టికెట్ దాదాపు పులపర్తి రామాంజనేయులుకు ఇచ్చేశారు. ఈయన టీడీపీ మనిషి. అనూహ్యంగా ఎన్నికలకు ముందు పవన్‌కు జై కొట్టారు. పవన్ కూడా ఆయనకు కండువా కప్పారు. టికెట్ అనౌన్స్‌మెంట్ ఒక్కటే మిగిలింది. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఇప్పటి వరకు జెండాలు కట్టి.. జేజేలు కొట్టిన వారిలో ఒక్కరిని ఎంపిక చేసుకుని.. తన సత్తా చూపించివారిని గెలిపించుకుంటే అది కదా.. పవన్ పౌరుషం. కానీ, టీడీపీ నుంచి తీసుకుని టికెట్ ప్రకటించేందుకు రెడీ అయినా.. కాపులు సైలెంట్‌గా ఉన్నారు. ఈ సైలెంటే రేపు కొంప ముంచడం ఖాయమనేది ప్రధాన చర్చ.