టీడీపీ జనసేన : ఫస్ట్ లిస్ట్ కి కౌంట్ డౌన్ ...!

తెలుగుదేశం పార్టీ జనసేన తొలి జాబితాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ముహూర్తం కూడా కుదిరింది

Update: 2024-02-23 16:41 GMT

తెలుగుదేశం పార్టీ జనసేన తొలి జాబితాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 24న ఈ లిస్ట్ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కలసి మాఘ పున్నమి శుభవేళ మంచి ఘడియలలో తమ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను రిలీజ్ చేయనున్నారు. దాదాపుగా అరవై నుంచి డెబ్బై దాకా అభ్యర్ధుల లిస్ట్ ఉంటుంది అని అంటున్నారు.

అందులో టీడీపీ నుంచి అరవై మంది ఉంటే జనసేన నుంచి పది మంది దాకా అభ్యర్ధులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ జాబితాలో అన్ని జిల్లాల నుంచి అభ్యర్ధులు ఉండేలా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 18 మంది సిట్టింగులలో ఎందరికి టికెట్లు ఇస్తారు అన్న చర్చ సాగుతోంది. మాజీ మంత్రి గంటా విశాఖ ఉత్తరం నుంచి తాజా మాజీగా ఉన్నారు. ఆయనకు చీపురుపల్లి చోటు చూపిస్తున్నారు. కాబట్టి పెండింగులో పెట్టే చాన్స్ ఉంది. అలాగే రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటులో జనసేన అభ్యర్ధికి ఇస్తే ఆయనకు నో చాన్స్ అంటున్నారు.

అదే విధనగ రాజమండ్రి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీ ప్లేసులో ఆమె భర్త వాసుకు టికెట్ ఇవ్వాలనుకుంటే ఆ సిట్టింగ్ సీటు కూడా లేనట్లే. మొత్తం మీద చూస్తే 15 మంది దాకా సిట్టింగులకు సీటు దక్కవచ్చు అని వినిపిస్తోంది. అదే విధంగా సీనియర్ నేతల సీట్లు తొలి జాబితాలో ఉంటాయని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చూస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత పేర్లు తొలి జాబితాలో ఉంటాయని అంటున్నారు.

విజయనగరం జిల్లాలో చూస్తే విజయనగరం అసెంబ్లీ నుంచి అశోక్ గజపతి సీటుతో పాటు బొబ్బిలి సీటు, ఎస్ కోట, పార్వతీపురం, సాలూరు వంటి సీట్లు ఉంటాయని అంటున్నారు. శ్రీకాకుళంలో చూస్తే ఆముదాలవలస నుంచి కూన రవికుమార్ అలాగే పాతపట్నం, పలాస, సీట్లు ఈ దఫాలో ఉండే చాన్స్ ఉంది.

జనసేన విషయానికి వస్తే విశాఖలో భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, ఎలమంచిలి సీట్లు ప్రకటిస్తారు అని అంటున్నారు. మిగిలిన ఆరేడు సీట్లు ఉభయ గోదావరి జిల్లాలలో ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక రెండు పార్టీలు కలిపి విడుదల చేసే సీట్ల విషయంలో ఆశావహులు ఎలా రియాక్ట్ అవుతారు, రెండు పార్టీలలో త్యాగమూర్తులు ఎవరో కూడా వెల్లడి కానుంది. ఏది ఏమైనా కొన్ని సీట్ల వద్ద పీటముడి ఇంకా తెమలడంలేదు అని అంటున్నారు. చూడాలి మరి ఆ పంచాయతీ ఎలా ఎండ్ అవుతుందో.

Tags:    

Similar News