జనసేన గాజు గ్లాస్ ఎంత పని చేసింది?
జనసేన పార్టీ గుర్తు అన్నంతనే గాజు గ్లాస్ అని ఠక్కున చెప్పేస్తారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది జనసేన.
జనసేన పార్టీ గుర్తు అన్నంతనే గాజు గ్లాస్ అని ఠక్కున చెప్పేస్తారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది జనసేన. అయితే.. పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ పోటీ ఉండనుంది. ఈ స్థానాల్లో జనసేన నేరుగా పోటీ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమకుమార్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ పరిధిలోని మిగిలిన నియోజవర్గాల్లో మాత్రం పవన్ బొమ్మను వాడుతూ కొందరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం గందరగోళం చోటు చేసుకుంది. కారణం.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిప్రసాద్ గౌడ్ కు ఎన్నికల సంఘం గాజు గ్లాసును కేటాయించటం బీజేపీకి తలనొప్పిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో మాత్రమే జనసేన నేరుగా పోటీ చేస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుంది.
ఇలాంటివేళ.. మునుగోడులో ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించటంతో బీజేపీ అభ్యర్థి మీద ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గాజు గుర్తును చూడగానే జనసేన గుర్తుగా భావించి ఓటేస్తే.. దాని ప్రభావం బీజేపీ మీద ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు పలువురు జనసేన మద్దతు ఇస్తున్న విషయాన్ని తెలియజేస్తూ.. పవన్ కల్యాణ్ ఫోటోను ముద్రించిన కండువాలు.. గాజు గ్లాస్ గుర్తు ఉన్న కండువాలతో పాటు కమలం పువ్వును ప్రచారం చేస్తున్న వేళ.. గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించటం ఇబ్బందికరంగా మారింది.