ఎయిర్ పోర్ట్ లో ఓ కత్తెర అంత పని చేసింది.. బిగ్ ట్విస్ట్ కూడా ఉంది!

సాధారణంగా విమానాలు రద్దాయ్యాయంటే రెగ్యులర్ గా వాతావరణం అనుకూలించకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది.

Update: 2024-08-21 15:30 GMT

సాధారణంగా విమానాలు రద్దాయ్యాయంటే రెగ్యులర్ గా వాతావరణం అనుకూలించకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇదే సమయంలో భద్రతా కారణాలతో అప్పుడప్పుడూ ఈ సర్వీసులు రద్దవ్వడమో, ఆలస్యం అవ్వడమో జరుగుతుంటుంది. అయితే ఓ కత్తెర కనిపించకపోవడం వల్ల విమానాలు రద్దైన సంగతి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు జరిగింది!

అవును... ఇప్పటివరకూ తెలిసిన కారణాలతో కాకుండా సరికొత్త కారణంతో విమానాలు భారీ సంఖ్యలో రద్దవ్వగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయి. ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. ఇదంతా ఓ కత్తెర కనిపించకపోవడం వల్ల జరిగిందని తెలియడంతో ప్రయాణికులు అవక్కయ్యారు. అసలు ఏమి జరిగిందని ఆరాతీయడం మొదలుపెట్టారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం...!

జపాన్ లోని హక్కైడో ద్వీపంలో గల అత్యంత రద్ధీగా ఉండే న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ లో గత శనివారం ఓ రిటైల్ స్టోర్ లో నుంచి కత్తెర కనిపించకుండా పోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సుమారు రెండు గంటల పాటు సమయం పట్టింది. దీంతో.. సుమారు 36 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి రాగా.. మరో 201 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

ఈ వ్యవహారంపై ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే... ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెర ను దొంగిలించి దాన్ని ఆయుధంగా చేసుకొనే అవకాశం ఉందని.. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ... ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే... ఆ కనిపించకుండా పోయిన కత్తెర దుకాణాంలోనే దొరికిందంట. దీంతో.. ఆ స్టోర్ లో మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది.

Tags:    

Similar News