అనంతపురం జిల్లా మా చేతిలో పెడితే... జేసీల కోరిక !
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా తన మనసులోని మాటను బయట పెట్టారు
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా తన మనసులోని మాటను బయట పెట్టారు. గత ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నుంచి బరిలో దింపిన ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు చంద్రబాబు వద్దని చెబుతున్నా.. గెలుపు బాధ్యత తీసుకున్న జేసీ సోదరులు.. తమ వారసులను రంగంలోకి దింపారు. అయితే.. వైసీపీ హవా నేపథ్యంలో ఇద్దరు వారసులు కూడా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి స్థానిక వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వివాదాలతోనే వారు కాలం గడిపేస్తున్నారు.
ఇక, ఇప్పుడు మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు జేసీ సోదరులనే పోటీ చేయాలని కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సారి కూడా ఇద్దరూ తప్పుకొంటున్నారని.. వారి వారసులే రంగంలోకి దిగుతు న్నారనేది తెలిసిందే. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారు. ముఖ్యంగా పొరుగు నియోజకవర్గాల్లోనూ(అనంతపురం అర్బన్, పుట్టపర్తి, శింగనమల) జేసీ సోదరుల దూకుడు ఎక్కువగా ఉంది. దీంతో పార్టీ లో వారి విషయం తరచుగా చర్చకు వస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు దూకుడుకు కారణం ఏంటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా తన మనసులో మాట విప్పారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. జిల్లా మొత్తాన్ని తమకు అప్పగించాలని.. అప్పుడు పార్టీ దూకుడు ఎలా ఉంటుందో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలకమైన నాయకులు వారి వారి నియోజకవర్గాల్లో హవా చలాయిస్తున్నారు. వీరిలో వరుస విజయాలు పొందిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. జేసీ ప్రభాకర్, దివాకర్‌రెడ్డిల మనసు మాత్రం జిల్లా మొత్తంపై ఉండడం గమనార్హం.
అయితే.. వారు కోరుకుంటున్నట్టుగా జిల్లా మొత్తంపైనా ఆధిపత్యం ఇచ్చేందుకు కానీ.. వారి హవా చలాయించేందుకు కానీ.. చంద్రబాబు అంగీకరిస్తారా? అంటే.. డౌటే. ఎందుకంటే.. వారికంటే ముందుగా పార్టీ కోసం పనిచేసినవారు.. ప్రాణాలు అర్పించిన వారు కూడా ఉన్నారు. సో.. వారు అనుకున్న విధంగా అయితే.. కోరిక తీరే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. 2014 వరకు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో ఉన్న జేసీ సోదరులు.. రాష్ట్ర విభజన తర్వాత.. వైసీపీని కాదని టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికే అనేక మంది జిల్లా నాయకులు పార్టీని నడిపించారు. సో.. జేసీ బ్రదర్స్ కోరుకున్నట్టు చంద్రబాబు వారికి ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.