టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్... లోకేష్ రియాక్షన్ ఇదే!
ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంటుంది.
ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంటుంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ మంత్రి, నేతలతో కలిసి ర్యాలీలో ఒకే వాహనంపై వైసీపీ నాయకుడు చేతులూపుతూ ప్రత్యక్షమయ్యారు! దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై నారా లోకేష్ స్పందించారని తెలుస్తోంది.
అవును... నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత, మంత్రి కొలుసు పార్ధసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించగా.. ఆ ర్యాలీలో జోగి రమేష్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
మరోపక్క జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారనే సందేహాలతో కూడిన ప్రచారమూ ఊపందుకుంది. మరోపక్క టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్ ప్రత్యక్షమవ్వడం, వేదిక పంచుకోవడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు ఈ ఆగ్రహం నారా లోకేష్ దృష్టికి చేరిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఈ వ్యవహారంపై అధిష్టాణం ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషలను నారా లోకేష్ కోరినట్లు తెలుస్తోంది. మరి... వీరిరువురూ లోకేష్ కు ఎలాంటి వివరణ ఇస్తారనేది వేచి చూడాలి.
మరోపక్క... నిన్న మొన్నటి వరకూ తమను ఎక్కి తొక్కిన జోగి రమేష్ ఇలా తమ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై పలువురు కార్యకర్తలు నేతలను నిలదీశారని అంటున్నారు.
మరోవైపు.. టీడీపీ కార్యక్రమానికి తగుదునమ్మా అంటూ వెళ్లారంటూ వైసీపీ శ్రేణుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఓ పక్క కూటమి ప్రభుత్వం తమపై కేసులు బనాయిస్తుంటే.. ఈయన ఆ పార్టీ కార్యక్రమంలో వేదికలు పంచుకోవడం ఏమిటంటూ ఫైరవుతున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో... ఆయన ఇంతవరకూ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదని.. ఓటమి తర్వాత నియోజకవర్గంలో కార్యకర్తలకు ధైర్యం చెప్పే ఒక్క పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించలేదని మండిపడుతున్నారని అంటున్నారు. మరి దీనిపై జోగి రమేష్ ఎలా స్పందిస్తారనేది చూడాలి!