వీళ్లు మనుషులేనా? అవినీతిని బయటపెట్టాడని పాశవికంగా చంపేశారు

హత్యల గురించి తెలిసిందే. మన దేశంలో నిత్యం ప్రతి గంటలో.. ఏదో ఒక మూలన హత్యలు జరగటం తెలిసిందే.

Update: 2025-01-07 04:57 GMT

హత్యల గురించి తెలిసిందే. మన దేశంలో నిత్యం ప్రతి గంటలో.. ఏదో ఒక మూలన హత్యలు జరగటం తెలిసిందే. అయితే.. ఒక హత్య ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. వైద్యులు సైతం తమ అనుభవంలో ఇంత పాశవిక హత్యను తామెప్పుడు చూడలేదని విస్మయానికి గురవుతున్నారు. హింసాత్మక వార్తలు చదవటం ద్వారా ఒత్తిడికి గురయ్యే వారు.. సున్నిత మనస్కులు ఈ వార్తను చదవకుండా స్కిప్ చేయటం మంచిది. కాకుంటే.. ఈ దారుణ హత్య గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రజల సొమ్మును పప్పుబెల్లాల మాదిరి పంచేసుకున్న అవినీతి పందికొక్కుల గురించి రాసిన ఒక కథనం సంచలనంగా మారితే.. తమ గుట్టుమట్లను బయటకు తీసిన జర్నలిస్టు ఒకరిని అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రూ.120 కోట్ల విలువైన కాంట్రాక్టులో చోటు చేసుకున్న అవినీతిని బయటపెట్టాడని బస్తర్ కు చెందిన ముఖేష్ అనే జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు.

ఒక జాతీయ మీడియా సంస్థలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్న అతను.. బస్తర్ ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120కోట్లతో రోడ్డు ప్రాజెక్టు పనుల్ని మొదలు పెట్టారు. ఈ ప్రాజక్టులో భారీగా అవినీతి జరిగిందని.. ముకేశ్ కథనాన్ని చేశారు. తొలుత రూ.50 కోట్ల టెండర్ తో మొదలైన ఈ ప్రాజెక్టు.. పూర్తిస్థాయిలో జరగలేదని.. ఈ ప్రాజెక్టు రూ.120 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేస్తూ రాసిన కథనం సంచలనంగా మారింది.

కట్ చేస్తే.. ఈ కథనం పబ్లిష్ అయ్యాక అతను కనిపించకుండా పోయాడు. ఈ అవినీతి ప్రాజెక్టుకు కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ లో శవంగా కనిపించాడు. పచ్చబొట్టు ఆధారంగా ఆ డెడ్ బాడీని ముఖేష్ దిగా గుర్తించారు. అందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు హతుడి బంధువులే కావటం గమనార్హం. ఈ హత్య జరిగిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ముఖేశ్ డెడ్ బాడీకి జరిగిన పోస్టుమార్టం సందర్భంగా వైద్యులు షాక్ కు గురయ్యారు.

కారణం.. హతుడి గుండెను చీల్చి బయటకు తీయటమే కదు.. అతడి కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు. అతడి పక్కటెముకులు ఐదు చోట్ల.. తలపై పదిహేను చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఏళ్లకు ఏళ్లు సర్వీసు ఉన్న వైద్యులు సైతం.. ఈ తరహా హత్యను తాము ఇప్పటివరకు చూడలేదంటున్నారు. ఈ పాశవిక హత్యను ఇద్దరు కంటే ఎక్కువ మందే కలిసి చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ముఖేశ్ హత్య కేసులో కీలక నిందితుడైన సురేష్ చంద్రకర్ ను పోలీసులు సోమవారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఇతను ముఖేవ్ కు దూరపు బంధువులు అవుతాడు.

ముఖేశ్ కనిపించకుండా ( హత్యకు గురైన) పోయిన రోజు నుంచి సురేశ్ సైతం కనిపించకుండా పోయాడు. దతాజాగా అతడ్ని హైదరాబాద్ లో అరెస్టు చేశారు . హైదరాబాద్ లోని తన కారు డ్రైవర్ ఇంట్లో సురేష్ దాక్కొని ఉండగా.. పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఇతడి ఆచూకీ కోసం 200 సీసీ కెమేరాలు.. 300 మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టి.. చివరకు ఈ పాశవిక హత్యకు కారణమైన కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News