జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ చివరి దశలో ఉందని వెల్లడించారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అయితే.. ప్రభుత్వం మీద విషం చిమ్మే కొన్ని పేపర్లలో పనిచేసే విలేకరులకు మాత్రం ఇళ్ల స్థలాలివ్వబోమని తేల్చిచెప్పారు. న్యూట్రల్‌గా ఉన్న మిగతా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిస్తామని పేర్కొన్నారు.
తాను గతంలో ఉద్యమం జరిగేటప్పుడే ఈ రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలున్నాయని చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. కొన్ని గుల పత్రికలున్నాయన్నారు. న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదు కానీ వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? అని ప్రశ్నించారు.
ఎవరికి ఇళ్లస్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ విచక్షణ మీద ఆధారపడి ఈ నిర్ణయం ఉంటుందన్నారు. పొద్దున లేస్తే.. తమకు, తమకంటే.. రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఇళ్ల స్థలాలు ఎందుకివ్వాలి అని నిలదీశారు. వారికి ఎందుకియ్యాలి? పాలు పోసి పాములను పెంచలేం కదా? కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సంస్థల విధానాలకు జర్నలిస్టులను ఎలా ఇబ్బంది పెడతారని విలేకరులు ప్రశ్నించగా.. 'జర్నలిస్టులకు కూడా ఉండాలి కదా? కీలు బొమ్మలాగా ఉండేవారు జర్నలిస్టులవుతారా? సోయి ఉండాలి కదా? ఆ మాత్రం జ్ఞానం, విజ్ఞానం ఉండాలి కదా?' అని కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు.
తెలంగాణతో పోల్చుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాలు భయపడే రాష్ట్రంలో.. 'జీతాలు పడతలేవు' అని రాస్తున్నారని మండిపడ్డారు. ఒక్కటే దెబ్బలో మొన్న రూ.20వేల కోట్ల రుణం మాఫీ చేశాం కదా... ఇప్పుడు ఆ పేపర్.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది? అదొక పేపరా? అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ద బెస్ట్ స్టేట్, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్‌బీఐ, నీతిఆయోగ్ తెలంగాణను ప్రశంసించాయని కేసీఆర్ గుర్తు చేశారు. పార్లమెంటులో కేంద్ర మంత్రులు కూడా ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారన్నారు. అయినా కూడా.. మేం ఒకటే రొడ్డ కొట్టుడు కొడ్తం.. మా ఇష్టమొచ్చినట్లు రాస్తం అన్నట్టు ఒక దిక్కుమాలిన పేపరు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. విజ్ఞత ఉన్నవారికి కూడా సిగ్గనిపిస్తుందన్నారు. పొద్దున లేస్తే.. అట్ల చెయ్యొచ్చునా.. అది జర్నలిజమా అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా కొందరికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తామని.. మిగిలినవారికి ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ప్రశ్నించడం మీడియా బాధ్యత అని గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు.
ఉద్యమాన్ని ముందుండి నడిపిన జర్నలిస్టులను సీఎం కేసీఆర్ పాములతో పోల్చడం బాధాకరమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ఆయన అక్రమాలపై, బందిపోట్ల రాష్ట్ర సమితి దోపిడీపై నిజానిజాలు బయటపెడితే జర్నలిస్టులు విషం చిమ్మినట్లా అని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాన్ని మరిచి అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం తీరాక జర్నలిస్టులను కాటేసిన కాలనాగు కేసీఆర్ అని షర్మిల నిప్పులు చెరిగారు. జర్నలిస్టులు తమ జీవితాలను త్యాగం చేయకపోతే రాష్ట్రం వచ్చేదా? నియంత కేసీఆర్‌కు అధికారం దక్కేదా? అని ప్రశ్నించారు. తక్షణమే జర్నలిస్టులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.