కేటీఆర్‌పై కేసు.. స్పందించిన కేఏ పాల్.. అత్యంత చెత్త కేసంటూ..

దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి.

Update: 2025-01-04 22:30 GMT

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమోదు చేసిన కేసుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. అందులోనూ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశం అయ్యాయి.

కేటీఆర్‌పై పెట్టిన కేసు దేశంలోనే అత్యంత చెత్త కేసుగా పాల్ అభివర్ణించారు. ఈ కేసులో ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ నోటీసులు ఇచ్చిందని, దీని వెనుక ఉన్న దురుద్దేశం ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. బేషరతుగా వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు. ఈ మొత్తంలో కొంతమంది మంత్రులు దోచుకుని మరికొంత ఢిల్లీకి కప్పం కట్టారని పాల్ ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో రైతులకు చేసిన నష్టాన్ని త్వరలోనే ఇంటింటికీ తీసుకువెళ్లి వివరిస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల వారు ఏమైనా నగదు, బహుమతులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం రానున్న ఎన్నికల్లో తనకే వేయాలని కేఏ పాల్ కోరారు. ప్రజాశాంతి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు అండగా ఉంటామని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోకుండా ప్రజా పాలన సాగించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవి ఊడిపోయే ముక్కు లాంటిదని, అది ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

అయితే.. సీఎం రేవంత్ రెడ్డికి తనంటే చాలా ఇష్టమని.. ఆయనను ఇప్పటివరకు ఐదుసార్లు కలిసినట్లు కేఏ పాల్ వెల్లడించారు. సీఎంగా రేవంత్ రెడ్డి లక్ష కోట్లు అప్పు చేశారని, మరో లక్ష కోట్లు అప్పు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే లక్ష కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యవస్థను పాడు చేయడానికి చంద్రబాబు తీసుకువచ్చాడని, దీనివల్ల వర్గీకరణ కోసం మాల, మాదిగలు కొట్టుకుంటున్నారని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి దిశగా పయనించాలంటే కేఏ పాల్ రావాలని ఈ సందర్భంగా వెల్లడించారు. రాజకీయ ప్రేరేపిత కేసులు వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, దీనిపై అన్ని పార్టీల నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News