కడపలో ఇంటర్ విద్యార్థిని హత్యకు ఇదే అసలు కారణం!

గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.

Update: 2024-10-21 04:06 GMT

దేవుడంటే భక్తి లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు, శిక్ష పడుతుందనే భయమూ లేదు అన్నట్లుగా మారిపోతోంది కొంతమంది ఆలోచనా విధానం! కారణాలు ఏవైనా, పరిస్థితులు మరేవైనా.. ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందని తెలియకో.. లేక, ఆ పరిష్కారం చంపడమే అని భావించో కానీ.. క్రూరత్వానికి ఉన్మాదాన్ని జతచేస్తున్నారు.

గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో అత్యంత కిరాతకంగా మారుతున్న మృగాళ్ల సంఖ్య peరిగిపోతోంది. తాజాగా వైఎస్సార్ జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది ఘాతుకానికి ఇంటర్మీడియట్ విద్యార్థిని బలైపోయిన సంఘటన తీవ్ర సంచలన రేపింది. ఈ సమయంలో ఈ ఘటనకు గల కారణాలు ఎస్పీ వివరించారు.

అవును... వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని ఆదివారం కడప రిమ్స్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. నిందితుడు విఘ్నేష్ శనివారం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించగా.. సుమారు 80 శాతం గాయపడిన ఆమెను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత కడప రిమ్స్ కి తరలించారు.

ఈ సమయంలో చికిత్స పోందుతూ ఆమె మరణించింది. అంతకంటే ముందు.. ఆమె నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సమయంలో ఈ హత్యకు గల కారణాన్ని ఎస్పీ వివరించారు. ఇందులో భాగంగా... తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ బాలిక అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించారు.

నిందితుడు విఘ్నేష్ తో ఆమెకు ఐదేళ్లుగా పరిచయం ఉందని.. ఈ క్రమంలో ఇద్దరూ బద్వేలుకు 10 కిలో మీటర్ల దూరంలో కాసేపు గడిపారని.. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని అడిగిందని.. అయితే అప్పటికే పెళ్లైన అతడు ఆమెతో వాగ్వాదానికి దిగాడని.. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఎస్పీ తెలిపారు.

అయితే.. పథకం ప్రకారమే అతడు ఈ హత్య చేశాడని.. ముందుగానే సీసాతో పెట్రోల్ వెంటపెట్టుకెళ్లాడని.. కావాలనే అటవీప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడని ఎస్పీ తెలిపారు. వ్యూహాత్మకంగా తన ఫోన్ ను కడపలోనే ఉంచి, భార్య ఫోన్ వాడాడని ఎస్పీ వివరించారు.

Tags:    

Similar News