ఎన్నికల ముంగిట ఢిల్లీలో చీపురును చీల్చుతున్న కమలం?
ఈ విషయం పక్కనపెడితే.. సరిగ్గా రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆప్ నకు భారీ షాక్ తగిలింది.
రాజకీయాలంటే అంతే.. వీలైతే ప్రత్యర్థిని నేరుగా ఢీకొనాలి.. లేదంటే ప్రత్యర్థిని శక్తి హీనం చేయాలి.. తద్వారా మన బలం పెరగకున్నా ప్రత్యర్థి శక్తిహీనం కావడంతో మనం విజయం సాధిస్తాం.. ఇప్పుడిదే ఫార్ములాను ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (ఆప్)పై ప్రయోగిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఆప్ అధినేత కేజ్రీవాల్ ను మద్యం కేసులో జైలుకు పంపి నైతికంగా దెబ్బకొట్టిన కాషాయ పార్టీ.. ఇప్పుడు సంస్థాగతంగానూ వెన్నువిరుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరో మంత్రి రాజీనామా..
ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పదేళ్లుగా ఆప్ అధికారంలో ఉంది. అటు ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరిగా తయారయ్యారు కేజ్రీ. దీంతో ఈసారి ఢిల్లీలో ఆప్ ను ఓడించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. సరిగ్గా రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆప్ నకు భారీ షాక్ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వాన్నీ వదులుకున్నారు. ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని.. పార్టీ తీవ్రమైన సవాళ్లలో ఉందని విమర్శిస్తూ కేజ్రీకి లేఖ రాశారు. ప్రజలకు సేవ చేయాలని నిబద్దతతో ఏర్పడిన పార్టీ ఆశయాలను నాయకుల రాజకీయ ఆశయాలు అధిగమించాయని ఆరోపించారు. కాగా, కేజ్రీ సీఎంగా ఉన్నప్పుడే సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు.
ఇది బీజేపీ కుట్రనే..
గెహ్లోత్ రాజీనామాను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీ కుట్రగా పేర్కొన్నారు. ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గెహ్లోత్ ను సీబీఐ, ఈడీ టార్గెట్ చేయడంతోనే రాజీనామా చేశారని ఆరోపించారు. కాగా, ఆప్ మునిగిపోయే పడవ అని.. అందుకే అందరూ బయటకు వచ్చేస్తున్నారని బీజేపీ ఢిల్లీ శాఖ పేర్కొంది. ఆప్ ప్రస్తుతం ‘ఖాస్ ఆద్మీ పార్టీ’గా మారిందని ఎద్దేవా చేసింది మండిపడ్డారు. కొసమెరుపు ఏమంటే..
కైలాశ్ గెహ్లోత్ రాజీనామా చేసిన కాసేపటికే బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరారు. కిరారీ నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు.