మంత్రి కాకానికి సీబీఐ క్లీన్ చిట్.. చార్జిషీట్‌లో సంచలన విషయాలు
ఏపీ వైసీపీ నాయకుడు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కమ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫోర్జరీ పత్రాల కేసులో ఆయన పాత్ర లేదని తేల్చి చెప్పారు.
ఏపీ వైసీపీ నాయకుడు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కమ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫోర్జరీ పత్రాల కేసులో ఆయన పాత్ర లేదని తేల్చి చెప్పారు. ఈ పత్రాలు మాయమ వడం వెనుక మంత్రిఎలాంటి కుట్ర పన్నలేదని తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. దీంతో ఎన్నికలకు ముందు మంత్రి కాకానికి బిగ్ రిలీఫ్ వచ్చినట్టు అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏంటీ కేసు..?
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ నేత, తన ప్రత్యర్ధి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో కేసు పెట్టారు. అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారని, విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని అప్పట్లో సోమిరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆధారాలతో ఆయన నెల్లూరులోని IV అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు.
ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో 2023 ప్రారంభంలో కోర్టులో దొంగతనం జరిగింది. ఈ వ్యవహారం కూడా.. రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ దొంతనంలో కాకాని ఆస్తులకు సంబంధించి తాను ఇచ్చిన ఆధారాలను కూడా కొట్టేశారని.. అదేవిధంగా కోర్టులో మంత్రికి వ్యతిరేకంగా పోలీసులు సమర్పించిన ఆధారాలు కూడా దొంగతనానికి గురయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలని, దీనిపై సీబీఐ విచారణ వేయాలని అభ్యర్థించారు.
అంతేకాదు.. ఈ దొంగతనం వెనుక మంత్రి కాకాని హస్తం ఉందని అప్పట్లో సోమిరెడ్డి ఆరోపించారు. మంత్రి కాకానిని కేబినెట్ నుంచి తొలగించాలని టీడీపీడిమాండ్ చేసింది. ఇక, సోమిరెడ్డి అభ్యర్థనతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి విచారణ చేసిన సీబీఐ అధికారులు దాదాపు 80 మందిని సాక్షులుగా గుర్తించి విచారించారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మంత్రికి క్లీన్ చిట్ ఇచ్చింది. చార్జిచీట్‌లో ఆయన తప్పు ఏమీలేదని. కోర్టులో జరిగిన దొంగతనానికి, మంత్రికి సంబంధం లేదని పేర్కొంది. సయ్యద్ రసూల్, ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేశారని, పోలీసుల నిష్పాక్షికంగానే కేసును విచారించారని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. దీంతో కాకానికి ఎన్నికలకు ముందు బిగ్ రిలీఫ్ వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.