కామారెడ్డి బీఆరెస్స్ లో కొత్త సమస్య... కొట్టుకుంటున్నారుగా!
తెలంగాణలో ఎన్నికల సందడి తారా స్థాయికి చేరింది. అధికార విపక్షాలు ఎత్తులు పైఎత్తులతో ముందుకుపోతున్నారు.
తెలంగాణలో ఎన్నికల సందడి తారా స్థాయికి చేరింది. అధికార విపక్షాలు ఎత్తులు పైఎత్తులతో ముందుకుపోతున్నారు. మరోపక్క ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. మధ్యమధ్యలో ఆపరేషన్ ఆకర్షలు, ఘర్ వాపసీలు కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీఆరెస్స్ ను ఎలాగైనా గద్దెదింపాలని విపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో కేసీఆర్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేస్తున్నారు.
అందులో భాగంగా 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి భారీ మెజారిటీలతో గెలిచిన కేసీఆర్ ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వాటిలో ఒకటి గజ్వేల్ కాగా.. మరొకటి కామారెడ్డి. ఇప్పటికే గజ్వేల్ లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కేసీఆర్ పై సై సై అంటుండగా.. కామారెడ్డి పై పీసీసీ చీఫ్ రేవంత్ పూర్తి కాన్సంట్రేషన్ చేశారు. ఈ సమయంలో కామారెడ్డి బీఆరెస్స్ లో కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి.
అవును... కేసీఆర్ పోటీచేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డికి ఇన్ ఛార్జ్ గా కేటీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 100మంది నామినేషన్లు దాఖలు చేస్తామంటూ పౌల్ట్రీ రైతులు ముందుకు వచ్చారు. ఇవి చాలవన్నట్లు తాజాగా మాచారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డి - ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు భౌతిక దాడుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో భాగంగా... జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డి పై ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు దాడి చేశారు. దీంతో రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాచారెడ్డి మండల సన్నాహక సమావేశంలో భాగంగా చుక్కపూర్ గ్రామ ఎన్నికల ఇంచార్జ్ నియామకం విషయంలో చెలరేగిన వాగ్వాదంతో దాడులు జరిగాయని తెలుస్తుంది.
ఈ సమయంలో... చుక్కపూర్ గ్రామ ఎన్నికల ఇంచార్జ్ విషయంలో తానును చెప్పిన వారికే బాధ్యతలు ఇవ్వాలని, మధ్యలో నీ పెత్తనం ఏంటని రాంరెడ్డిపై నర్సింగ్ రావు దాడి చేశారని అంటున్నారు. ఈ క్రమంలో దాడి ఘటనకు సంబంధించి పార్టీ అధిష్టానానికి నర్సింగ్ రావుపై రాంరెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. ఈ విషయంపై కేటీఆర్ సీరియస్ గా ఉన్నారని సమాచారం!
మరోవైపు మాచారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డిపై నర్సింగ్ రావు దాడిని నిరసిస్తూ రాం రెడ్డి అనుచరులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా చుక్కపూర్ వద్ద ఆందోళనకు దిగి, నర్సింగ్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావుపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో విషయం చర్చనీయాంశం అయ్యింది. అత్యంత రసవత్తరంగా జరుగుతున్న ఎన్నికల వేళ ఈ కొంపలో కుంపటి పనులేమిటని బీఆరెస్స్ కార్యకర్తల మధ్య చర్చ నడుస్తుందని సమాచారం! మరి ఈ పంచాయతీని కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాలి.