పవన్ కి జోగయ్య ఇచ్చిన సందేశం ఇదేనా...?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శ్రేయోభిలాషిగా పెద్దాయనగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య తరచూ సలహా సూచనలు ఇస్తూ ఉంటారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శ్రేయోభిలాషిగా పెద్దాయనగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య తరచూ సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. ఆయన ఇంతకీ జనసేనలో ఉన్నారా అంటే లేరు. కానీ ఆయన జనసేన గెలవాలని పవన్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ మాటకు వస్తే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచి మెగాస్టార్ సీఎం కావాలని ఆయన కోరుకున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన వారు రాజ్యాధికారం చేపట్టాలని పెద్దాయన ఆకాంక్ష.
అయితే ఇటీవల జనసేనలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ టీడీపీతో పొత్తుని రాజమండ్రి జైలు బయట ప్రకటించిన తరువాత ఒక్కసారిగా జనసేనలో జోష్ తగ్గింది. ఆ తరువాత దిలీప్ సుంకర లాంటి గట్టి నేతలు కూడా దూరం అయ్యారు. కొన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు సైతం రాజీనామా చేసి వెళ్లారు.
ఇక పవన్ అయితే పార్టీ క్యాడర్ తో మాట్లాడుతూ తనను అర్ధం చేసుకోవడం లేదని అసహనం వెళ్ళగక్కుతూ వచ్చారు. విశాఖ సభలో సైతం ఆయన సీఎం అని అనవద్దు ఓట్లేసి గెలిపించండి అని చెప్పుకొచ్చారు. ఒంటరిగా పోటీ చేస్తే ముప్పయి సీట్ల దాకా గెలుస్తామని అదే పొత్తుతో వెళ్తే అధికారం దక్కుతుంది అని అన్నారు. సీఎం పదవి తానూ చంద్రబాబు కలసి కూర్చుని చర్చిస్తామని పవన్ చెబుతున్నారు.
కానీ క్యాడర్ మాత్రం పవన్ సీఎం కావాలని అంటోంది. ఇలా ఒక విధంగా జనసేనలో గందరగోళమైతే ఒకింత ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో జనసేనకు పవన్ కి శ్రేయోభిలాషిగా ఉన్న పెద్దాయన హరిరామ జోగయ్య బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ కి క్యాడర్ కి మధ్య ఏర్పడిన ఒక విధమైన అభిప్రాయ భేదాలను ఆయన ఒక ప్రకటన రూపంలో జోగయ్య బయటకు తెచ్చారు.
అధికారంలోకి జనసేన రావాలని క్యాడర్ అంటోందని, పవన్ మాత్రం ఓట్లు వేయాలని అంటున్నారు జోగయ్య విశ్లేషించారు. అయితే రెండూ ముఖ్యమే అని ఆయన తేల్చేశారు. అంటే పవన్ కోరినట్లుగా ఓట్లు వేయాలి. అలాగే జనసేనకు అధికారం కావాలన్నది జోగయ్య మాటగా ఉంది. అదే సమయంలో జనసేన ఎన్ని సీట్లు టీడీపీ నుంచి కోరవచ్చో కూడా చెప్పేశారు. పొత్తులో భాగంగా అరవై దాకా సీట్లు తీసుకుంటే జనసేన నెగ్గే పరిస్థితి కనిపిస్తోందని భరోసా ఇచ్చారు.
టీడీపీ వెంట జనసేన అన్నట్లుగా కాకుండా జనసేన వెంట టీడీపీ అన్న భావన కలిగించాలని ఆయన సూచించడం విశేషం. అదే జరిగితే కచ్చితంగా మరో మూడు నెలలలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తుందని జోగయ్య జోస్యం చెప్పారు.
అధికారం దక్కించుకోవడం కోసం పవన్ కృషి చేయాలని కూడా జోగయ్య అంటున్నారు. అంటే అరవై సీట్లు కనుక జనసేనకు ఇస్తే కచ్చితంగా పవర్ షేరింగ్ తప్పనిసరి అపుడే టీడీపీ కనీసం రెండేళ్ల పాటు అయినా అధికారాన్ని జనసేనకు ఇస్తుందన్నది జోగయ్య ఆలోచనగా ఉంది అని అంటున్నారు. మొత్తానికి జోగయ్య అటు పవన్ మాటను నెగ్గిస్తూనే క్యాడర్ కోరుకుంటున్నది కూడా పవన్ వినాలన్నట్లుగా తన మాటగా చెప్పేశారు. ఈ పెద్దాయన అంటే పవన్ కి గౌరవం ఉంది. మరి ఆయన చెప్పిన మాట ఇచ్చిన సందేశం పవన్ వింటారా అన్నది చూడాల్సి ఉంది.