కార్తీక మాసం వచ్చేసింది... ప్రత్యేకతలు, విశిష్టతలు ఇవే!
అటు శైవులకు, ఇటు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం.. కార్తీక మాసం. దీపావళి అమావాస్య ముగియడంతో ఇక కార్తీక మాసం వచ్చేసింది.
అటు శైవులకు, ఇటు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం.. కార్తీక మాసం. దీపావళి అమావాస్య ముగియడంతో ఇక కార్తీక మాసం వచ్చేసింది. ఈ మాసానికి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. మాసమంతా సముద్ర స్నానాలు, నదుల్లో స్నానాలు, దీపారాధనలు, శివయ్యకు నిత్య పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, ఒంటిపూట భోజనం, భూతల శయనం, కార్తీక వనసమారాధనలు, పంచారామాల సందర్శనం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో గడిచిపోతుంది.
అలాగే దీపావళి అమావాస్య ముగిసి కార్తీక మాసం ప్రవేశించడంతోనే ఇక శీతాకాలం కూడా ప్రవేశించినట్టే. చల్లటి వాతావారణం, ఎండెక్కినా వీడని మంచు తెరలు.. తెల్లవారుజామునే చన్నీటి తలస్నానాలు, ఓవైపు అయ్యప్ప దీక్షాపరులు, ఇంకోవైపు శివమాల, గోవింద మాల, భవానీ మాలల దీక్షాపరులతో కార్తీక మాసమంతా గొప్ప సందడిని సృష్టిస్తుంది.
కార్తీక మాసంలో తలారా స్నానం చేసి ఒక్క రోజు దీపారాధన చేసినా ఇప్పటివరకు చేసిన సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ ఆ కైలాసనాథుడు భక్తులను కటాక్షిస్తాడని పండితులు చెబుతున్నారు. సాక్షాత్తూ కాశీ ఖండం, భీమ ఖండంలోనూ, వాయు పురాణం, శివ పురాణం, మార్కండేయ పురాణాల్లోనూ కార్తీక మాసం విశిష్టత గురించి ప్రస్తావనలున్నాయని పేర్కొంటున్నారు.
కార్తీక మాసమంతా సూర్యోదయానికే ముందే లేచి సమీపంలోని నదులు లేదా సముద్ర తీరాల్లో స్నానం ఆచరించి దీపారాధన, పూజలు చేసి సమీపంలోని దేవాలయాన్ని సందర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే శాఖాహారంతో కూడిన మితాహారం తీసుకోవడం మంచి చేస్తుందని చెబుతున్నారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరంగానూ, మానసికంగానూ కార్తీక మాసం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొంటున్నారు.
ఉదయంతోపాటు సాయంత్రం సైతం చన్నీటి స్నానం కార్తీక దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఆలయాల్లో శివపురాణ పఠనం చేస్తే ఎంతో శ్రేయస్కరమని అంటున్నారు.
కార్తీక మాసంలో దీపదానం మొదలుకొని ఫలదానం, లింగదానం, అన్నదానం, కన్యాదానం వరకు అనేక దానాలు శక్తి కొద్దీ ఇవ్వాలని స్కాంద పురాణం వివరిస్తోంది. ఇక దీపం మనలోని అజ్ఞానాన్ని (చీకటి) తొలగించి జ్ఞానాన్ని (వెలుగు) ప్రసాదిస్తుంది.
కార్తీక మాసమంతా నిత్య పూజలు, దీపారాధనలు చేయడంతోపాటు బంధు మిత్రులతో కలిసి వన భోజనాలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో అంతా అసంతృప్తి, అలసటతో నిండిన శరీరానికి, మనసుకు వన భోజనాలు, బంధుమిత్రులతో సరదాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.
అందుకే కార్తీకంతో సమానమైన మాసం లేదు.. వేదాలను మించిన శాస్త్రం లేదు.. ఉత్సాహాన్ని మించిన ఆరోగ్యం లేదు.. కేశవునితో సమానమైన దైవం లేదు అంటారు. దీన్నిబట్టి కార్తీక మాస విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.