కవిత అరెస్టు వేళ.. ఢిల్లీలో ఇవాళ జరిగేది ఇదేనా?
శుక్రవారం అర్థరాత్రి వేళకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన కవితను.. రాత్రి వేళ అక్కడే ఉంచేశారు.
నెలల తరబడి సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయటం.. ఢిల్లీకి తీసుకెళ్లటం లాంటి పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. శుక్రవారం అర్థరాత్రి వేళకు ఢిల్లీకి చేరుకున్న ఆమెకు ఈ రోజు అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు. ఎందుకుంటే.. ఆమెను శనివారం సాయత్రం 5 గంటల్లోపు కోర్టులో హాజరు పర్చాలి. కోర్టు ఆమెకు రిమాండ్ విధిస్తుందా? బెయిల్ మంజూరు చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఈ రోజున ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తారని చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి వేళకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన కవితను.. రాత్రి వేళ అక్కడే ఉంచేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ముందే వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును కోర్టుకు సమర్పిస్తారని తెలుస్తోంది.
మరోవైపు.. ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మాజీ మంత్రి కేటీఆర్ లు ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ అధికారుల అనుమతితో భర్తతో కలిసి కారులో బయలుదేరిన కవిత వెంట కొందరు అధికారులు ఉన్నారు. విస్తారా ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమెను ఈడీ ఆఫీసులోనే రాత్రంతా ఉంచారు.
ఈ రోజు (శనివారం) కేసీఆర్.. కేటీఆర్ లు ఇద్దరు ఢిల్లీకి చేరుకొని పలువురు న్యాయ నిపుణులతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. కవితకు తమ నైతిక మద్దతు ఉంటుందన్న విషయాన్ని తెలియజేందుకు వీలుగా ఢిల్లీకి వెళుతున్నట్లుగా కేసీఆర్ వర్గీయులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న వేళలో ఈడీ అరెస్టు అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు జాతీయ మీడియాతో కేసీఆర్.. కేటీఆర్ లు మాట్లాడతారని చెబుతున్నారు. కవిత అరెస్టు.. తెలంగాణ రాజకీయాలు.. జాతీయ రాజకీయాలు.. మోడీ - బీజేపీ విదానాలపైనా వీరు మాట్లాడే వీలుంది. ఇదిలా ఉంటే కవిత అరెస్టు చేసిన తీరు సాంకేతికంగా తప్పుల తడకగా ఉందని.. సుప్రీంలో ఆమె తరఫు వాదిస్తున్న న్యాయవాది మోహిత్ రావు చెబుతున్నారు. న్యాయపరంగా కవితకు చాలా అవకాశాలు ఉన్నాయని.. అరెస్టును సుప్రీంలో సవాల్ చేస్తామని చెబుతున్నారు.