తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఎలా గుర్తు పెట్టుకుంటుంది?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి టీఆర్ఎస్ పోరాటాలు చేస్తూ.. ఉద్యమాల పేరుతో నిర్వహించే ఆందోళనల సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ భావోద్వేగ ప్రసంగాలు చేసేవారు.

Update: 2024-12-31 09:22 GMT

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి టీఆర్ఎస్ పోరాటాలు చేస్తూ.. ఉద్యమాల పేరుతో నిర్వహించే ఆందోళనల సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ భావోద్వేగ ప్రసంగాలు చేసేవారు. తాను కలలు కంటున్న తెలంగాణ ఆవిష్కారమయితే.. ఎలా ఉండాలన్న దానిపై ఆయన చాలానే మాటలు చెప్పేవారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులు ఏవీ కూడ తెలంగాణ రాష్ట్రంలో ఉండదని.. సామరస్య వాతావరణంలో రాజకీయాలు సాగుతాయన్న అభిలాషను వ్యక్తం చేసేవారు. దేశంలో మరెక్కడా లేనంత స్ఫూర్తిదాయక పాలన తెలంగాణలో సాగుతుందన్న మాట ఆయన నోటి నుంచి తరచూ వచ్చేది.

తమ కోట్లాట మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసమేనని.. ఒకసారి ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత దేశానికే ఆదర్శప్రాయంగా ఉండే రాజకీయాల్ని తెలంగాణలో చూడొచ్చంటూ నమ్మకంగా చెప్పేవారు. అలాంటి కేసీఆరే ఈ రోజున వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు ఎలాంటి మాటలు చెప్పిన మనిషి.. ఇప్పుడెలా వ్యవహరించారన్న భావన కలుగక మానదు. ఆ మాటకు వస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన ఆయన తొమ్మిదిన్నరేళ్లు అప్రతిహతంగా పాలన సాగించారు. ఆ సందర్భంలోనూ తనదైన ఒంటెద్దు పోకడల్ని ప్రదర్శించటం దేశ వ్యాప్తంగా మాట్లాడుకునే దుస్థితి.

మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి రారట కదా? అన్న ప్రశ్నను తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తరచూ ఎదుర్కొనేవారు. తాను నమ్మిన వాస్తు ప్రకారం.. సచివాలయాన్ని కొత్తగా కట్టిన తర్వాతే అడుగు పెట్టాలన్న పంతాన్ని ఎలా తీర్చుకున్నారో.. అందుకు ఎన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారో తెలిసిందే. అధికార పక్షానికి అధినేతగా ఉన్నప్పుడు సొంత మంత్రుల్ని సైతం ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను అయితే.. ప్రగతి భవన్ గేటు వద్దకు వచ్చే సాహసమేచేసేవారు కాదు.

ఎంత పెద్ద అధికారి అయినా సరే.. తన నుంచి పిలుపు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే తప్పించి.. పాలనకు సంబంధించి అంశాల్ని మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చే వారన్న విమర్శను పెద్ద ఎత్తున ఎదుర్కొనేవారు. మొత్తంగా హ్యాట్రిక్ విజయాన్ని మిస్ చేసుకొని.. ఎన్నికల్లో ఓటమి భారంతో ఫాం హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ తీరు ఇప్పుడు చర్చగా మారింది. కారణం.. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన సహకారాన్ని అందించిన దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని చూసేందుకు కానీ.. ఆయన అంత్యక్రియలకు కానీ హాజరు కాలేదు. అంతేనా.. చివరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ఫోన్ చేసి.. మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని కోరినా.. ఆయన రాని పరిస్థితి.

మరోవైపు ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేత కం మేనల్లుడు సభలో ఏదోలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిల్లి.. గిచ్చి.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేసేందుకు ప్రయత్నించారే తప్పించి.. హుందాగా వ్యవహరించింది లేదు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఎలా గుర్తుంచుకుంటుంది అని? చివరగా.. తెలంగాణ గురించి.. తెలంగాణ వాదం గురించి..తెలంగాణ వాదుల గురించి గొప్పలు చెప్పే కేసీఆర్.. తెలంగాణ పేరు చెప్పినంతనే గుర్తుకు వచ్చే అలె నరేంద్ర.. కొండా లక్ష్మణ్ బాపూజీ.. దేశిని చిన్నమల్లయ్యల మరణ వేళలో ఎలాంటి గౌరవ మర్యాదలు ఇచ్చింది తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు తన రాజకీయ ప్రయోజనాలు మినహా కేసీఆర్ కు మరేమీ పట్టవా? అన్న సందేహం కలుగక మానదు.

Tags:    

Similar News