ఎన్నికల ఫలితాలతో రేవంత్.. కేసీఆర్ ఫ్యూచర్ తేలనుందా?

ఇప్పటికే ఉత్తర.. పడమరలుగా ఉండే సహచరుల్ని ఎప్పటికప్పుడు బుజ్జగించుకుంటూ ప్రభుత్వ రథాన్ని లాగుతున్న రేవంత్ కు ఎన్నికల ఫలితాలు తేడా వస్తే.. అగ్నిపరీక్షే అవుతుంది.

Update: 2024-05-11 04:32 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి.. విపక్ష నేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ఇద్దరికి ప్రాణసంకటంగా మారాయి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో విజయం ఇద్దరికి అత్యవసరం. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇద్దరికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని మజ్లిస్ కు వదిలేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ చీఫ్ అసద్ కు వచ్చే మెజార్టీలో తక్కువ వస్తుందే తప్పించి.. గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా లేదంటున్నారు. ఆ మాటకు వస్తే మాధవీలత పుణ్యమా అని.. ఇంతకాలం ఆయనకు వ్యతిరేకంగా పని చేసిన ఎంబీటీ లాంటి పార్టీలు సైతం అసద్ కు మద్దతు ఇస్తున్నాయి.

అంటే.. తెలంగాణలోని 17 సీట్లలో ఒకటి మజ్లిస్ కు వదిలేసి.. మిగిలిన 16 ఎంపీ స్థానాల గురించి చూస్తే.. వీటిలో ఎవరెన్ని సీట్లను సొంతం చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. తమకు పది ప్లస్ సీట్లను ఇచ్చేయటం ద్వారా చాలానే మేలు జరుగుతుందని గులాబీ నేతలు చెబుతున్నా.. వాస్తవంలో ఆ వాదనకు ఎలాంటి లాజిక్ లేదనే మాట వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ బలంగా పని చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఈసారి ఎన్నికల ఫలితాలు మొత్తం బీజేపీకి అనుకూలంగా మారతాయని చెప్పాలి.

ఎన్నికల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చి.. తొమ్మిది కంటే తక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ కు అంతకు మించిన కష్టం.. నష్టం మరొకటి ఉండదు. తెలంగాణలో తనకు తిరుగులేదన్న వాదనను మాటలతో కాకుండా చేతలతో చెప్పాలంటే కాంగ్రెస్ కు కనీసం 9 సీట్లు ఖాయంగా రావాలి. ఒకవేళ పది దాటితే ఆయనకు తిరుగులేదని చెప్పాలి. కాకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పది స్థానాలు ఒక్క పార్టీకే దక్కటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ ఏడు కంటే తక్కువ స్థానాలకు కాంగ్రెస్ పరిమితమైతే.. రేవంత్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి.

ఇప్పటికే ఉత్తర.. పడమరలుగా ఉండే సహచరుల్ని ఎప్పటికప్పుడు బుజ్జగించుకుంటూ ప్రభుత్వ రథాన్ని లాగుతున్న రేవంత్ కు ఎన్నికల ఫలితాలు తేడా వస్తే.. అగ్నిపరీక్షే అవుతుంది. ఆయనపై కత్తి కట్టే వారిసంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. కాకుంటే అధిష్ఠానం దగ్గర మంచి పేరు ఉండటం ఒక్కటే ఆయనకున్న స్పెషల్ అడ్వాంటేజ్ గా చెప్పాలి. ఇక.. గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే.. ఏ యాంగిల్ లో చూసినా ఆయనకు ఎదురుదెబ్బలే కనిపిస్తున్నాయే తప్పించి.. సానుకూలాంశం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించట్లేదు.

సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రతి నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో అధికార కాంగ్రెస్.. బీజేపీ మధ్యనే నెలకొని ఉంది. కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య పోటీ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీకి సానుకూల వాతావరణం లేదన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. మహా అయితే మూడు సీట్లకు మించి రావంటున్నారు. ఒకవేళ.. మూడు సీట్లను సాధించినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. మహా అయితే ఉనికిని కాపాడుకోవటానికి కాస్తంత దన్నుగా నిలుస్తాయని చెప్పాలి. అంతకంటే తక్కువ సీట్లు వస్తే మాత్రం.. మహా ఇబ్బందులు ఖాయమంటున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ కు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ లు ఇద్దరూ అగ్నిపరీక్షనే ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News