బీఆర్ఎస్ కు వరుస షాకులా ?

శాసనసభ్యులను డిస్ క్వాలిఫై చేస్తు ప్రజాప్రతినిధుల కోర్టు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తోంది

Update: 2023-08-25 07:01 GMT

శాసనసభ్యులను డిస్ క్వాలిఫై చేస్తు ప్రజాప్రతినిధుల కోర్టు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంఎల్ఏ బీ. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు గురువారం తీర్పిచ్చింది. తన తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. దీంతో కృష్ణకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయిన డీకే అరుణనే ఎంఎల్ఏగా కోర్టు ప్రకటించింది. కోర్టు తాజా తీర్పుతో కృష్ణమోహన్ రెడ్డికి ఏమవుతుంది ? డీకే అరుణకు ఏమవుతుందన్నది ప్రశ్నకాదు.

కోర్టు డిస్ క్వాలిఫై చేసిందా లేదా అన్నదే కీలకం. ఎందుకంటే ఈమధ్యనే కొత్తగూడెం ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కూడా చెల్లదని కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వనమా చేతిలో ఓడిపోయిన జలగం వెంకటరావును కోర్టు ఎంఎల్ఏగా ప్రకటించింది. ఇద్దరు కూడా 2018 ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ దగ్గర తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారన్నదే కేసు. ఐదేళ్ళ విచారణ తర్వాత వీళ్ళపై ఆరోపణలు రుజువ్వటంతో ఎంఎల్ఏలు ఇద్దరినీ కోర్టు డిస్ క్వాలిఫై చేసింది.

వీళ్ళిద్దరి సంగతిని పక్కనపెట్టేస్తే బీఆర్ఎస్ లోని సుమారు 20 మంది మీద ప్రజాప్రతినిధుల కోర్టులో వివిధ కేసులు విచారణలో ఉన్నాయి. కేసీయార్ మీద కూడా కేసులు విచారణ దశలో ఉంది. ఎన్నికల కమీషన్ కు తప్పుడు అఫిడవిట్లు ఇవ్వటం అవి తర్వాత ఎప్పుడో నిరూపితం కావటం మామూలైపోయింది. కేసు విచారణ జరిగి తీర్పు వచ్చేంతలోపు పుణ్యకాలం గడచిపోతోంది.

ఇద్దరి ఎంఎల్ఏల ఎన్నిక చెల్లదని తీర్పులు వచ్చాయి. మరి మిగిలిన కేసుల్లో ఎలాంటి తీర్పులు వస్తాయో తెలీటంలేదు. ఇద్దరిలో వనమా అసలు బీఆర్ఎస్ ఎంఎల్ఏనే కాదు. కాంగ్రెస్ తరపున పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన జలగం వెంకటరావు మీద గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. రాబోయే ఎన్నికల్లో ఫిరాయింపు ఎంఎల్ఏ వనమాకే కేసీయార్ టికెట్ ప్రకటించారు. వనమా కొడుకు వనమా రాఘవేంద్ర కారణంగా బీఆర్ఎస్ కొత్తగూడెంలో అంత గబ్బుపట్టినా వనమాకే కేసీయార్ మళ్ళీ టికెట్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News