కేసీఆర్ దమ్మేంటో నువ్వు చూడాల్నా.. నేను చూడాల్నా..?
అవును... దమ్ముంటే కొడంగల్ లో పోటీ చేయాలన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికీ మధ్య జరిగే మాటల యుద్ధం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తమదైన వాక్ చాతుర్యంతో ఇద్దరు నేతలూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ, తమదైన ప్రాసలతో ఛాలెంజ్ లు చేసుకునే విధానం రాజకీయాల్లో రసవత్తర ఎపిసోడ్ గా ఉంటుందని చెబుతుంటారు. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరూ ఒకరిపై ఒకరు మండిపడ్డారు. ఇందులో భాగంగా తనకు రేవంత్ చేసిన ఛాలెంజ్ పై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
అవును... దమ్ముంటే కొడంగల్ లో పోటీ చేయాలన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. అచ్చంపేట బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఈ సందర్భంగా రేవంత్ కామెట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా... కొందరు కొడంగల్ కు రా.. కొడవలి పట్టుకుని రా అంటున్నారంటూ సెటైర్ వేసిన ఆయన... కేసీఆర్ దమ్మేందో ఇండియా అంతా చూసిందని, ఇప్పుడు కొత్తగా చూపించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇదే సమయంలో... కేసీఆర్ దమ్మేందో ఎదురుగా ఉన్న జనాన్ని చూస్తే చాలదా అంటూ అక్కడి ప్రజలనుద్దేశించి అనడంతో సభప్రాంగణం మొత్తం హోరెత్తింది. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ దమ్మేంటో నువ్వు చూడాల్నా.. నేను చూడాల్నా..? దేశం మొత్తం చూసిందంటూ కేసీఅర్ తనదైన శైలిలో స్పందించారు. ఇలా కొడంగల్ కు రమ్మని ఒకడు, గాంధీ బొమ్మ దగ్గరకి రమ్మని ఇంకొకడు పిలుస్తున్నారు.. ఇది రాజకీయమా అని కేసీఆర్ ప్రశ్నించారు!
అనంతరం... పాలమూరు ప్రజలు బోంబైకి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించిన కేసీఆర్... పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు గ్రహించాలని కేసీఆర్ సూచించారు. అదేవిధంగా... ఇంటింటికీ నల్లానీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణేనని, ఆ విషయం ప్రజలు గుర్తించాలని అన్నారు!
ఇదే సమయంలో 24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తే.. కాంగ్రెస్ ను వీడి బీఆరెస్స్ కండువా కప్పుకుంటానని ఆనాడు జానారెడ్డి సవాల్ విసిరారని గుర్తు చేసిన కేసీఆర్.. 24 గంటల కరెంటు ఇచ్చి చూపించాక వారి సవాల్ ఏమైందని ప్రశ్నించారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రైతులు కరెంట్ కోసం ధర్నాలు చేస్తున్నారని.. ప్రధాని రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదని తెలిపారు.
ఇక.. తెలంగాణలో రైతు బంధు, దళిత బంధు తీసుకొచ్చిందే కేసీఆర్ అని స్పష్టం చేసిన ఆయన... ధరణి లేకపోతే రైతులు నష్టపోతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళితబంధు పోతాయని.. అందుకే ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అలాకానిపక్షంలో అంధకారంలోకి పోతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. బీఆరెస్స్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ “ధమ్ము మాటల వీడియో” నెట్టింట వైరల్ అవుతుంది!