అభ్యర్థుల ఎంపికలోనే చేతులెత్తేసిన గులాబీ అధినేత!
ప్రతిపక్షంగా ఉండే వేళలో ఎదురయ్యే పరిమితులకు కేసీఆర్ సైతం మినహాయింపు కాదన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఊహించని రీతిలో నిర్ణయం తీసుకొని అందరికి షాకిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ.. తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తన సత్తాను చాటుకోవటం అనివార్యంగా మారిన పరిస్థితి. ఇలాంటి వేళ.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటాలంటే అందుకు తగ్గట్లుగా బరిలో రేసుగుర్రాల్లాంటి బలమైన అభ్యర్థుల ఎంపిక అవసరం ఎంతైనా ఉంది. అందుకు భిన్నంగా ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులను చూస్తేనే పెదవి విరిచే పరిస్థితి.
ప్రతిపక్షంగా ఉండే వేళలో ఎదురయ్యే పరిమితులకు కేసీఆర్ సైతం మినహాయింపు కాదన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ టికెట్ల కోసం కిందా మీదా పడుతూ.. అధినేత చల్లని చూపు తమ మీద పడితే అదే పదివేలు అనుకునే పరిస్థితి నుంచి.. పార్టీ టికెట్ ను తమకు ఆఫర్ చేయొద్దు భగవంతుడా? అని ప్రార్థించే పరిస్థితి. మరికొందరు నేతలు మరింత సింఫుల్ గా తాము పోటీ చేయలేమని.. తమను రేసు లెక్కలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు.
ఇలాంటివేళ.. తాజాగా రెండు ఎంపీ అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించారు. వీరి పేర్లను విన్నంతనే ఉలికిపాటుతో పాటు.. వీరు రేసుగుర్రాలా? అన్న సందేహం కలిగే పరిస్థితి. ఇప్పటివరకు ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల సంగతి తెలిసిందే. తాజాగా రెండు లోక్ సభ స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు గులాబీ బాస్. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మల్కాజిగిరి సీటు కాగా.. మరొకటి ఆదిలాబాద్ ఎంపీ స్థానం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి స్థానానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరుల పేర్లు ఇప్పటివరకు వినిపించగా.. అందుకు భిన్నంగా ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేయటం షాకింగ్ గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి.. అవేమీ ఫలించని వేళ ఆయన హస్తం పార్టీ నుంచి బయటకు వచ్చేసి గులాబీ కారులో ఎక్కేయటం తెలిసిందే.
వాస్తవానికి ఈ రెండు లోక్ సభ స్థానాలు అత్యంత కీలకమైనవి. అలాంటి రెండు స్థానాలకు ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన అభ్యర్థులు ఇప్పుడు అందరిని సర్ ప్రైజ్ అవుతున్నారు. ఏం లెక్కలు వేసుకొని కేసీఆర్ వీరిని లోక్ సభా ఎన్నికలకు అభ్యర్థులుగా ప్రకటించారన్నది ప్రశ్నగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే శంభీపూర్ రాజు పేరు దాదాపు ఫైనల్ అయినట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు బదులుగా లక్ష్మారెడ్డికి టికెట్ ను ఫైనల్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంచి పేరున్న ఆయనకు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పట్టు లేదు. ఆర్థికంగా కూడా శంభీపూర్ రాజు.. మల్లారెడ్డి కొడుకు లాంటి వారితో పోల్చినా తక్కువే. ఏ వ్యూహంలో భాగంగా ఆయన్ను అభ్యర్థిగా ఎంపిక చేశారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రెండో అభ్యర్థిగా ప్రకటించిన ఆత్రం సక్కు విషయానికి వస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ టికెట్ ఆశించారు. ఆయన అనుకున్నట్లుగా టికెట్ దక్కలేదు. ఆయనకు కేటాయించాల్సిన అసెంబ్లీ టికెట్ ను కోవా లక్ష్మికి ఇవ్వటం తెలిసిందే. ఆ టైంలో ఆత్రం సక్కుకు కేసీఆర్ మాట ఇచ్చారని.. ఇందులో భాగంగా తాజాగా టికెట్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన ఒక్కరే. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని ఆయనకు తాజా ఎన్నికల్లో టికెట్ ఫైనల్ కావటం పార్టీ వర్గాలు సైతం సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇక.. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనుకుంటే.. అందుకు భిన్నంగా బరిలోకి దిగాలన్న ఆదేశాలు జారీ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అభ్యర్థుల ఎంపికలోనే చేతులెత్తేసిన గులాబీ అధినేత
పోల్ మేనేజ్ మెంట్ లో తన పాత గురువు చంద్రబాబు తలలో నుంచి పుట్టినట్లుగా వ్యవహరిస్తారన్న పేరు గులాబీ బాస్ కేసీఆర్ కు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి ఆయన నోటి నుంచి ఏదైనా విశ్లేషణ వస్తే.. అది జరుగుతుందన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటిది లేదు. రాజకీయ వాతావరణం మారిపోవటమే కాదు.. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే గులాబీ బాస్ సైతం ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మూడు నెలల క్రితంతెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో.. నాటి అధికార బీఆర్ఎస్ టికెట్ల కోసం ఎంతటి పోటీ ఎందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్ ఇస్తే చాలన్న పరిస్థితులు ఉండేవి. అందుకు భిన్నంగా తాజా పరిస్థితులు ఉన్నట్లుగా చెప్పాలి. ఎప్పుడైతే చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీకి బదులుగా.. కాసాని జ్ఞానేశ్వర్ ను బరిలోకి దించారో అప్పుడే పార్టీ పరిస్థితి.. కేసీఆర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటన్నది అర్థమయ్యే పరిస్థితి.
ఇంతకాలం కేసీఆర్ కు కొండంత అండగా నిలిచిన పలువురు నేతలు.. మారిన రాజకీయ పరిస్థితులకు తగ్గట్లు మారిపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ టికెట్లను కేటాయిస్తామన్న సంకేతాలు ఏ మాత్రం అందినా.. వెంటనే రియాక్టు కావటం తమను పరిగణలోకి తీసుకోవద్దని కోరటం.. ఇటీవల కాలంలో కేసీఆర్ ఊహించని పరిణామాలుగా చెప్పక తప్పదు. ఎవరికి వారు తమను అభ్యర్థులుగా ప్రకటించొద్దని.. తాము తాజా ఎన్నికల్లో రేసుగుర్రాలుగా మారేందుకు సిద్ధంగా లేమంటూ.. ఎవరికి వారు తమ పరిమితుల్ని చెప్పుకొని తప్పుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న కసరత్తు.. ఫైనల్ గా అభ్యర్థుల ప్రకటనను చూస్తేనే.. పార్టీ ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న విషయం అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఈ మధ్యనే ఒక బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని.. దమ్ముంటే గెలిచి చూపించాలని ఓపెన్ ఛాలెంజ్ చేయటం తెలిసిందే. ఇలాంటివేళ.. పోటీపై టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వీలుగా అభ్యర్థుల ఎంపిక జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకపోవటం చూస్తే.. అభ్యర్థుల ఎంపికతోనే కేసీఆర్ చేతులు ఎత్తేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.