శ్రావణం నుంచి జిల్లాలకు కేసీఆర్!
జిల్లాల పర్యటనలో భాగంగా నేరుగా ప్రజల్లోకి వెళ్లి 9 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ వివరించనున్నారని తెలిసింది.
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆయన.. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని టాక్. శ్రావణ మాసం శుభప్రదమైనందని భావిస్తున్న కేసీఆర్.. శ్రావణం నుంచి జిల్లాల పర్యటన మొదలెట్టనున్నారని సమాచారం.
జిల్లాల పర్యటనలో భాగంగా నేరుగా ప్రజల్లోకి వెళ్లి 9 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ వివరించనున్నారని తెలిసింది. ఇప్పటికే అమలవుతున్న పథకాల లబ్ధిదారులకు అవసరమైనవి పంపిణీ చేయడంతో పాటు.. కొత్త పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్తారని సమాచారం.
కేసీఆర్ చివరిగా జూన్‌లో ఆసిఫాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. జులైలో నల్గొండ, సూర్యపేట, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఆ పర్యటనలు రద్దయ్యాయి.
మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అధికారిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండదు. అందుకే అంతకంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
బీసీ బంధు, గృహ లక్ష్మీ, మైనారిటీ బంధు, దళిత బంధు పథకాల లబ్ధిదారులకు కేసీఆర్ చేతల మీదుగా చెక్కులు అందించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.