ఏపీలో కాంగ్రెస్ పునరుత్తేజానికి బీజేపీ బాటలు పరుస్తోందా ?

ఏపీలో రాజకీయం కాస్తా మూడు ప్రాంతీయ పార్టీల మధ్యనే కేంద్రీకృతమైంది. ఇందులో రెండు పెద్ద పార్టీలు ఉంటే మరో పార్టీ ఇపుడిపుడే బలాన్ని పెంచుకుంటోంది.

Update: 2025-01-31 03:49 GMT

ఏపీలో రాజకీయం కాస్తా మూడు ప్రాంతీయ పార్టీల మధ్యనే కేంద్రీకృతమైంది. ఇందులో రెండు పెద్ద పార్టీలు ఉంటే మరో పార్టీ ఇపుడిపుడే బలాన్ని పెంచుకుంటోంది. ఇక చూస్తే 2014 నుంచి ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర నామమాత్రం అయింది. బీజేపీకి తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే సీట్లు దక్కుతున్నాయి. లేకపోతే ఆ పార్టీ ఓటమి పాలు అవుతోంది. ఇది గడచిన మూడు ఎన్నికల్లో జరిగిన ఉదంతంగా చూస్తున్నారు.

అయితే బీజేపీ గెలిచిన ప్రతీ సారి తన గొప్పతనం అనుకుంటోంది. ఏపీలో తాను బలపడాలని చూస్తోంది. 2014లో టీడీపీ అండతో జనసేన మద్దతుతో గెలిచిన బీజేపీ పరోక్షంగా వైసీపీతో దోస్తీ చేసి ఆ పార్టీకి ఊతం ఇచ్చింది అన్న ఆరోపణలు ఉన్నాయి. దాని వల్లనే విషయం మొత్తం చెడి 2018 నాటికల్లా టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం జరిగింది.

బీజేపీ ఆనాడు వైసీపీతో కలసి ఏపీలో రాజకీయంగా బలపడాలని అనుకుంది. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సాయం అందించింది కానీ బీజేపీతో పొత్తుని బాహాటంగా కుదుర్చుకునేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా మళ్ళీ టీడీపీతోనే పొత్తుకు సిద్ధపడాల్సి వచ్చింది.

మరో వైపు చూస్తే 2014 కి 2024 కి మధ్యలో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు వచ్చాయి. నాడు ఎన్నికల్లో పోటీ చేయని పవన్ జనసేన 2019లో సొంతంగా పోటీ చేసి ఉనినికి చాటుకుంది. ఇక 2024 నాటి కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించి పవన్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు.

ఇక పవన్ కి సినీ సెలబ్రిటీగా విపరీతమైన క్రేజ్ ఉంది. అంతే కాదు ఏపీలో బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. మరే రాజకీయ నేతకూ లేనంతగా యువత మహిళల మద్దతు ఉంది. దాంతో బీజేపీ పవన్ మీద కోటి ఆశలను పెంచుకుంది. పవన్ ని ముందు పెట్టుకుని రేపటి రోజున ఏపీలో బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలో జగన్ తో బీజేపీకి అసలు అవసరం అన్నది లేదని అంటున్నారు.

ఏపీలో పవన్ ప్లస్ బీజేపీ బలపడాలి అంటే పొలిటికల్ వాక్యూం క్రియేట్ కావాలని కమలనాధులు ఆలోచిస్తున్నారు. టీడీపీకి అపోజిట్ గా ఉన్న వైసీపీ నిర్వీర్యం కావడం వల్లనే ఆ రాజకీయ శూన్యత ఏర్పాడుతుందని అంచనా కడుతున్నారు. దానికి అవసరమైన ఇంధనాన్ని బీజేపీ ఇపుడు సమకూర్చి పెడుతోంది.

వైసీపీని బీజేపీ గట్టిగా టార్గెట్ చేయడం వెనక ఉద్దేశ్యాలు వ్యూహాలు ఇవేనని అంటున్నారు. వైసీపీ అంతలా బలహీనం అయితే ఆ ప్లేస్ లో జనసేన బీజేపీ ఎమర్జ్ కావడానికి వీలు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఏపీలో జనసేన బీజేపీ టీడీపీల ఓటు బ్యాంక్ దాదాపుగా ఒక్కటే అని విశ్లేషణలు ఉన్నాయి.

వైసీపీ ఓటు బ్యాంక్ అన్నది కాంగ్రెస్ నుంచి ట్రాన్స్ ఫర్ అయి వచ్చింది. మైనారిటీలు దళితులు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఇలా వైసీపీ ఓటు బ్యాంకు ఉంది. అది ఎంత గట్టిది అన్నది 2024 ఎన్నికల్లో రుజువు అయింది అని గుర్తు చేస్తున్నారు. మూడు పార్టీలు కలసినా వైసీపీకి పడే ఓట్లను కదిలించలేకపోయారు అంటే అది వైసీపీ ఓటు బ్యాంకు గానే చూడాల్సి ఉందని అంటున్నారు. అంతే కాదు బీజేపీకి వ్యతిరేక భావజాలానికి వేరే రాజకీయ సిద్ధాంతానికి ఆ ఓటు బ్యాంకు నిదర్శనం అంటున్నారు.

ఈ వర్గాలు వైసీపీ ఏపీలో బలంగా ఉందని అట్టిపెట్టుకొని ఉన్నాయి. అదే వైసీపీ వీక్ అయితే తిరిగి కాంగ్రెస్ ని ఆశ్రయిస్తాయి తప్పించి కూటమిలోని ఏ ఒక్క వర్గమూ వైపు వచ్చే సీన్ ఉండదని అంటున్నారు. ఏపీలో సాగుతున్న ఆపరేషన్ వైసీపీ వల్ల జగన్ రాజకీయంగా ఇబ్బంది పడితే ఆ ప్లేస్ లోకి జనసేన బీజేపీ కాంబో రావడం అంత సులువు కాదని అంటున్నారు.

అదే టైం లో కాంగ్రెస్ ఎదిగేందుకు బ్రహ్మాండమైన చాన్స్ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ ఏపీలో బలపడేందుకు అవసరమైన రాజకీయ భూమిక లేదని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ 2014 నుంచి 2019 వరకూ అనుసరించిన స్ట్రాటజీని మార్చి ఇపుడు జగన్ ని టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ కి మంచి రోజులు రావచ్చు అన్నది ఒక విశ్లేషణ గా ఉంది. మరి వైసీపీ అయితే ఎంత మేరకు వీటిని తట్టుకుని నిలబడుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News