చిత్తుగా ఓడిన తర్వాత స్క్రిప్టు మారదా కేసీఆర్?
అపర మేధావులుగా వెలిగిపోతారు. తమకు తిరుగే లేదని మిడిసిపడతారు.
అపర మేధావులుగా వెలిగిపోతారు. తమకు తిరుగే లేదని మిడిసిపడతారు. తాము మాత్రమే తెలివైనోళ్లుగా భావిస్తారు. వినతులు చెవికెక్కవు. మంచి మాటలు అప్రియంగా మారతాయి. వాస్తవాలు అసత్యాలుగా నమ్ముతారు. అబద్ధాలు అత్యంత ప్రియమైన మాటలుగా మారతాయి. ఇదంతా చదువుతున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకు వస్తారు. అలా రావటంలో తప్పు లేదు.
గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత కూడా గులాబీ బాస్ తన తీరును మార్చుకోలేదు. ఆయన అదే తీరును ప్రదర్శిస్తున్నారు. కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానికి కాస్త టైం కూడా ఇవ్వకుండా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పాలనాపరమైన తప్పులు చేసే వరకు ఓపిక పడకుండానే.. తనకు తాను తీర్పులు ఇచ్చేస్తున్నారు. ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. ప్రజలు తిరగబడే రోజు దగ్గరకు వచ్చేసిందని.. పిచ్చి చేష్టలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇలా తనకు తోచిన వ్యాఖ్యల్ని చేసేస్తున్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు పత్రికల్లోకి వచ్చి.. చదువుకుంటున్న ప్రజలు పెద్దసారు మైండ్ సెట్ ను చూసి విస్మయానికి గురవుతున్న పరిస్థితి. ఇంతకాలం తాము ఎంతో మేధావిగా భావించిన నేత.. మరీ ఇంతలా వ్యవహరించటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాస్తవాల్ని వాస్తవాలుగా చూసినప్పుడు మాత్రమే ప్రజల మనసుల్లో ఏముంటుందో అర్థమవుతుంది. అందుకు భిన్నంగా తనదైన ప్రపంచంలో ఉంటూ.. తనకు అనిపించింది మాత్రమే నిజమని భావించటం వల్ల నష్టమే తప్పించి లాభం ఉండదన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు.
ప్రజల అకాంక్షలకు విరుద్ధంగా రేవంత్ పాలన సాగుతుందన్న విషయాన్ని బలంగా నమ్ముతున్నారు కేసీఆర్. ఇదే ఆయనతో వచ్చిన చిక్కుగా చెబుతున్నారు గులాబీ నేతలు. ఇలాంటి తీరుతోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లినప్పుడు.. తెలంగాణలోని ఎంపీ సీట్లలో అత్యధికం తమ సొంతమవుతుందన్న మాటను బహిరంగ సభల్లో చెప్పటం.. తీరా ఫలితాలు చూస్తే.. ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలుపు లేకపోవటం చూసినప్పుడు కేసీఆర్ అండ్ కో మీద ప్రజల్లో ఇంకా కోపం తగ్గలేదన్న విషయం అర్థమవుతుంది.
అదే సమయంలో.. అధికార బదిలీ జరిగినప్పుడు కొంతకాలం వెయిట్ చేయాలన్న చిన్న పాయింట్ ను సైతం గులాబీ బాస్ పట్టించుకోకపోవటంతో.. ఆయన చేసే వ్యాఖ్యలకు ఎలాంటి విలువా లేకుండా పోతోంది. విపక్ష నేతగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆయన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
కాలం ఆయనకు అవకాశాల్ని తీసుకొచ్చిందే తప్పించి.. ఆయనకు ఆయన సొంతంగా అవకాశాల్ని క్రియేట్ చేసుకున్నది లేదు. కాలం కలిసి రావటం.. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారటం.. దాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. కానీ.. వాటిని నిలబెట్టుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఒకవేళ.. జాలి.. దయ.. కరుణ లాంటి వాటిని మరింత పెంపొందించుకొని.. అహంకారం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం.. అతిశయం.. గర్వం..ప్రత్యర్థులపైన ప్రతీకారం.. తాను తప్పించి మిగిలిన వారెవరూ అధికారానికి చేరువగా రాకూడదన్న అత్యాశ లాంటివి ఆయన్ను దారుణంగా దెబ్బ తీశాయి.
లోక్ సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత అయినా ఆయన తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. అందుకు భిన్నంగా.. తన ఊహా ప్రపంచంలో తనకు అనిపించిన అంశాల్నే వాస్తవాలుగా భ్రమిస్తూ.. వాటిని ప్రజలకు అపాదించే ప్రయత్నం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని సూచన వినిపిస్తోంది. లేకుంటే.. మరిన్ని ఎదురుదెబ్బలకు ఆయన సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.